ఈ జాగ్రత్తలు పాటించకపోతే... కొంప కొల్లేరే!
Publish Date:Jun 11, 2021
Advertisement
సంసారాన్ని ఓ ప్రయాణంతో పోలుస్తూ ఉంటారు పెద్దలు. ఈ ప్రయాణంలో ఏ ఒక్కరు కాస్త ఆదమరచి ఉన్నా, వెనకబడిపోవాల్సిందే! ఆ పొరపొటు ఒకోసారి భాగస్వామిని చేజార్చుకునేంతవరకూ వెళ్లవచ్చు. లేదా శాశ్వతంగా మన పట్ల ఉన్న నమ్మకాన్ని పోగొట్టవచ్చు. అందుకే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు అనుభవజ్ఞులు. ఇంతకీ వారి సలహాలు ఏమిటంటే... కుటుంబంలో ఆఫీసు పెట్టొద్దు కెరీర్‌లో ముందుకు సాగాలంటే కష్టపడి పని చేయాల్సిందే! దానిని ఎవరూ కాదనలేరు. కానీ కుటుంబానికి కూడా కొంత సమయం కేటాయించకపోతే మన పడే కష్టానికి అర్థమే ఉండదు. కనీసం ఇంట్లో ఉండే సమయంలో అయినా టీవీ, ఫేస్‌బుక్‌లాంటి వ్యాపకాలను పక్కనపెట్టి భాగస్వామితో కాస్త మాట్లాడే ప్రయత్నం చేయాల్సిందే. ఆఫీసులో పని ఒత్తిడి గురించి కూడా భాగస్వామికి చెప్పి ఉంచితే... మీరు తనని కావాలనే దూరం ఉంచుతున్నారన్న భావన బలపడకుండా ఉంటుంది. ఆఫీసరు మీద ఆవేశం ఇంట్లో వద్దు చాలామంది చేసే పొరపాటే ఇది. తోటి ఉద్యోగులతోనో, స్నేహితులతోనో జరిగిన గొడవ తాలూకు కోపాన్ని ఇంట్లో వెళ్లగక్కుతూ ఉంటారు. ఆఖరికి ట్రాఫిక్‌లో ఆలస్యమైనా ఆ ఆవేశం ఇంట్లోనే ప్రదర్శిస్తారు. ఊరంతా తిరిగివచ్చి, ఇంటి బయట చెప్పులు విడవడంతోనే... రోజువారీ చిరాకులన్నీ మర్చిపోయి మనిషిలా మెలగమని సూచిస్తుంటారు పెద్దలు. అనుమానాస్పదమైన బంధాలు వద్దే వద్దు జీవితంలో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. ఎవరికెంత ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీ స్నేహం సంసారంలోకి ప్రవేశిస్తోందన్న అనుమానం ఉంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే! మీ స్నేహాన్ని భాగస్వామి అపార్థం చేసుకుంటున్నారనో, మీ బంధం హద్దులు మీరడం లేదనో అనుకుంటే ఉపయోగం లేదు. ఆ పరిస్థితిని దాటుకుని మొండిగా సాగే స్నేహం సంసారం చీలిపోయేందుకు దారితీస్తుంది. రహస్యాలు దాచవద్దు భార్యాభర్తల మధ్య మిగిలే రహస్యాలు ఎప్పటికైనా అపనమ్మకానికి దారితీస్తాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, అప్పులకి సంబంధించిన వ్యవహారాలు వారితో పంచుకుని తీరాల్సిందే! మనస్పర్థలు సహజమే రోడ్డు మీద ఓ ఇద్దరు మనుషులు ఎదురుపడితేనే గొడవలు మొదలైపోతుంటాయి. అలాంటిది ఇద్దరు మనుషులు ఏళ్లతరబడి కలిసి జీవిస్తే మనస్పర్థలు రాకుండా ఎలా ఉంటాయి. ఆ బేధాలను దాటుకుని ముందుకు సాగడం ఎలా అన్నది ఓ నైపుణ్యం. కోపంలో వాదించకుండా, అహంతో ఆలోచించకుండా, విచక్షణ కోల్పోకుండా పట్టువిడుపులకి సిద్ధపడుతూ సాగితేనే స్పర్థని దాటగలం. - నిర్జర.
http://www.teluguone.com/news/content/husband-and-wife-relation-35-72258.html





