వేసవిలో మూత్రపిండాలలో రాళ్ల ప్రమాదం.. కారణాలు ఏంటి? ఎవరికి ఎక్కువ రిస్క్..?
Publish Date:Apr 7, 2026
Advertisement
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం , ఇతర ఖనిజ స్ఫటికాలు మూత్రపిండాలలో పేరుకుపోయి, రాళ్లుగా ఏర్పడతాయి. భారతదేశంలో 12% కంటే ఎక్కువ మంది ప్రజలు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. అసలు వేసవిలో మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? ఈ సమస్య ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. మూత్రపిండాల రాళ్ల ప్రమాదం.. వేసవిలో శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతుంది. తగినంత నీరు తాగకపోవడం శరీరంలో తేమ శాతం తగ్గడానికి దారితీయవచ్చు. దీని వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. శరీరంలో నీటి కొరత మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ వంటి ఖనిజాల సాంద్రతను పెంచుతుంది. ఈ ఖనిజాలు కలిసి చిన్న స్ఫటికాలుగా ఏర్పడి మూత్రపిండాల్లో రాళ్లుగా మారుతాయి. మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ , యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల స్ఫటికాలు ఏర్పడతాయి. శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు, ఈ స్ఫటికాలు బయటకు వెళ్లలేక రాళ్లుగా మారతాయి. వేసవిలో డీహైడ్రేషన్ పెరగడం వల్ల ఈ ప్రమాదం అధికమవుతుంది. లక్షణాలు.. మూత్రపిండాల్లో రాళ్ల వల్ల మూత్రవిసర్జనకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దీనివల్ల నడుము కింది భాగంలో లేదా పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి కలగవచ్చు. ఎవరికి ఎక్కువ ప్రమాదం? వేసవిలో మూత్రపిండాలలో రాళ్ల ప్రమాదం కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నీరు తక్కువగా తాగడం, నీరు తాగడంలో నిర్లక్ష్యం చేసే వారికి ప్రమాదం ఉంటుంది. అలాగే.. ఎక్కువ ఎండలో తిరిగే వారికి, అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి, ఉప్పు ఎక్కువ తినేవారికి, ప్రోటీన్ ఎక్కువగా తీసుకునేవారికి, కాఫీ టీ లు, శీతల పానీయాలు ఎక్కువ తీసుకునేవారికి, శరీరం తొందరగా డీహైడ్రేట్ కు గురయ్యే వారికి వేసవి కాలంలో మూత్రపిండాలలో రాళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. నీరు ముఖ్యం.. వేసవిలో అధికంగా చెమట పట్టడం వల్ల నీటి అవసరం పెరుగుతుంది. సాధారణంగా, ప్రతిరోజూ 2.5-3 లీటర్ల నీరు త్రాగాలి. ఎక్కువగా చెమట పట్టినా లేదా బయట పనిచేసినా నీటిని మరింత ఎక్కువ తాగాలి. లేత పసుపు రంగు మూత్రం తగినంత నీరు తీసుకుంటున్నారని సూచిస్తుంది, అయితే ముదురు రంగు మూత్రం వస్తే.. నీరు బాగా తాగాలని సంకేతం. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/how-to-prevent-kidney-stones-in-summer-34-216831.html





