తల్లిదండ్రుల కోసం కేర్ టేకర్ ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
Publish Date:Jul 18, 2026
Advertisement
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు. తల్లిదండ్రులు చాలా పెద్దవారైపోయి, వారికి వారి పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో చాలా కుటుంబాలు కూడా కేర్ టేకర్ ను నియమించుకోవాలి అనుకుంటాయి. అయితే కేవలం అనుభవం ఉందనో లేదా తక్కువ పేమెంట్ తో కేర్ టేకర్ వస్తున్నారనో తల్లిదండ్రుల కోసం కేర్ టేకర్ ను నియమించడం మంచిది కాదని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణుల. తల్లిదండ్రుల ఆరోగ్యం, భద్రత , మానసిక ఆరోగ్యం కోసం మంచి కేర్ టేకర్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే కేర్ టేకర్ ను నియమించుకునే ముందు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. అవేంటో తెలుసుకుంటే.. ముఖ్యమైన విషయం.. మొదట తల్లిదండ్రులకు ఎలాంటి సంరక్షణ అవసరమో నిర్ధారించుకోవాలి. వారికి అల్జీమర్స్, డిమెన్షియా లేదా మరో తీవ్రమైన అనారోగ్యం ఉంటే, శిక్షణ పొందిన కేర్ టేకర్ అవసరం అవుతారు. వారికి కేవలం సమయానికి మందులు వేసుకోవడం, ఆహారం తినడం లేదా రోజువారీ పనులు చేసుకోవడంలో సహాయం అవసరమైతే, ఒక సాధారణ కేర్ టేకర్ కూడా సరిపోతారు. కేర్ టేకర్ ను ఎంచుకునే ముందు, స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, ఆహారం తినడం, మరుగుదొడ్డికి వెళ్లడం, మందులు వేసుకోవడం లేదా రాత్రిపూట వారికి ఎంత సంరక్షణ అవసరమో వంటి రోజువారీ అవసరాల లిస్ట్ ను తయారు చేసుకోవాలి. ఇది సరైన కేర్ టేకర్ ను ఎంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ప్రశ్నలు అడిగేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. కేర్ టేకర్ ను ఇంటర్ప్యూ చేసే సమయంలో అనుభవం గురించి అడిగితే సరిపోదు. వారు ఇంతకుముందు ఏ జబ్బు ఉన్న వ్యక్తులకు సర్వీస్ చేశారో, మెడిసిన్ షెడ్యూల్ ను నిర్వహించగలరో లేదో, అవసరమైతే భోజనం వండగలరో లేదో, వైద్య అత్యవసర పరిస్థితిలో సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి. వీల్‌చైర్ లో ఉన్న తల్లిదండ్రుల కోసం లేదా మంచం నుండి లేవడానికి సహాయం అవసరమయ్యే వారి గురించి పై విషయాన్ని ముందుగానే చర్చించాలి. తల్లిదండ్రులను కలవాలి.. కేర్ టేకర్ ను నియమించాలనే నిర్ణయం తీసుకునే ముందు, కేర్ టేకర్ ను తల్లిదండ్రులకు తప్పకుండా పరిచయం చేయాలి. దీనివల్ల తల్లిదండ్రులు, కేర్ టేకర్ ఇద్దరూ ఒకరితో ఒకరు కంఫర్ట్ గా ఉన్నారో లేదో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కొన్నిసార్లు, అనుభవం కంటే ప్రవర్తన , మాట్లాడే విధానం వంటివి ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రతి కేర్ టేకర్ ట్రైనింగ్ తీసుకున్నవారే అయి ఉండరు అనే విషయం గుర్తుంచుకోవాలి. చాలా మందికి వృద్ధులను చూసుకునే విషయంలో అనుభవం లేదా వైద్య శిక్షణ ఉండదు. అందువల్ల వృద్దులకు ఇన్సులిన్ ఇవ్వడం, రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేయడంలో,, గాయానికి కట్టు కట్టడం లేదా ఇతర నర్సింగ్ పనులు అవసరం అయితే.. వాటిని చేసేందుకు వీలుగా నర్సింగ్ శిక్షణ తీసుకున్న వారిని ఎంచుకోవాలి. కుటుంబ భాద్యత.. చాలామంది కేర్ టేకర్ ను నియమిస్తే.. ఇక తల్లిదండ్రుల విషయంలో ఎలాంటి బాధ్యత, భయం లాంటివి తమకు లేనట్టే అని అనుకుంటారు. కానీ కేర్ టేకర్ ఉన్నంత మాత్రాన కుటుంబ బాధ్యతలు పూర్తిగా వదిలేయాలని అర్థం కాదు.. కేర్ టేకర్ తల్లిదండ్రులను సరిగా చూసుకుంటున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి. కేర్ టేకర్ తమను బాగా చూసుకుంటున్నారా లేదా అని పెద్దలను అడిగి తెలుసుకుంటూ ఉండాలి, అలాగే కొందరు పెద్దవాళ్లు చాదస్తంగా కేర్ టేకర్ లు ఎంత బాగా చూసుకున్నా తృప్తి పడరు. ఇలాంటి పరిస్థితులలో కేర్ టేకర్ ను అర్ఖం చేసుకోవడం, కేర్ టేకర్ కు మద్దతుగా ఉండటం చాలా ముఖ్యం. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/hiring-a-caregiver-for-your-parents-35-226401.html




