హరీష్ రావు అరెస్టు.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
Publish Date:Jul 2, 2026
Advertisement
బీఆర్ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య నడిచిన సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలో గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పుల అంశాలపై చర్చించేందుకు గన్‌పార్క్ కు బయల్దేరిన హరీశ్‌రావును తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు. ఆ సవాల్ స్వీకరించిన హరీష్ రావు గన్ పార్క్ కు వెడుతుండగా అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పుకు గాను ప్రస్తుత ప్రభుత్వం రూ. 1.40 లక్షల కోట్ల వడ్డీ కడుతోందంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన సవాల్ తీవ్ర దుమారం రేపింది. ఈ ఆర్థికాంశాలపై, గురుకులాల వ్యవహారంపై కాంగ్రెస్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావు సై అన్నారు. హరీష్ రావు గన్ పార్క్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, తెలంగాణ భవన్ పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు.తనను అడ్డుకున్న పోలీసులపై హరీష్ ఫైర్ అయ్యారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట జరిగింది. ఈతోపులాటలో హరీష్ రావు కిందపడ్డారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు.
http://www.teluguone.com/news/content/harish-rao-arrested-25-224854.html





