సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల ధ్యాంక్స్!
Publish Date:Jun 24, 2026
Advertisement
ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంచుతూ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంపు, 2004 సెప్టెంబర్ కు ముందు నోటిఫికేషన్లతో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేబినెట్ నిర్ణయాలపై ఉద్యోగులలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులు సీఎం చంద్రబాబును బుధవారం (జూన్ 24) కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా తీసుకున్న వివిధ నిర్ణయాలతో తాము ఊరట పొందుతున్నామని ఉద్యోగ సంఘ నేతలు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న వివిధ సమస్యల పరిష్కారంతో ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబాలకు లబ్ది కలుగుతోందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికీ మరువలేమని వారు సీఎంకు కృతజ్ణతలు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల కోసం ఉద్యోగులు పని చేయాలని ఈ సందర్భంగా సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. ఉద్యోగ సంఘాలన్నీ కలిసి కట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్, ప్రసాద్, ఏపీ సచివాలయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, నాపా ప్రసాద్ సహా సీపీఎస్, పీఎస్ యూ ఉద్యోగుల అసోసియేషన్, గురుకుల, సొసైటీలు, డీఎస్సీ-2003 ఉపాధ్యాయుల సంఘానికి చెందిన నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.
http://www.teluguone.com/news/content/employee-unions-thank-cm-chandrababu-36-224006.html





