వివేకా హత్య కేసు: ఈడీ విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి.!
Publish Date:Oct 14, 2026
Advertisement
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వివేకా హత్య కేసులో మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. వివేకా హత్యకు ముందు, తర్వాత పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీలు జరిగాయన్న అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే. వివేకా హత్య కోసం 40 కోట్ల రూపాయల డీల్ కుదిరిందనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం.. ఈ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తుల ఆర్థిక మూలాలను గుర్తించేందుకు ఈడీ దర్యాప్తు చేస్తున్నది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాఖలు చేసిన చార్జిషీట్లలోని కీలక అంశాల ఆధారంగా ఈడీ ముందుకు సాగుతున్నది. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితులను, సాక్ష్యులు, అప్రూవర్ లను ఈడీ విచారించింది. గత కొన్నేళ్లుగా జరిగిన బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్లపై ఫోకస్ పెట్టింది. గతంలో ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్, కడప తదితర ప్రాంతాల్లో ఈడీ బృందాలు విస్తృత సోదాలు నిర్వహించాయి. ఆ తనిఖీల్లో కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు, లెక్కల్లో చూపని నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఈడీ విచారణకు పిలిచి విచారించడం సంచలనం సృష్టిస్తున్నది. అవినాశ్ రెడ్డి విచారణ ద్వారా సేకరించిన సమాచారాన్ని గతంలో సేకరించిన ఆధారాలతో సరిపోల్చి చూసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులో మరి కొందరు ప్రముఖులను కూడా ఈడీ విచారణకు పిలిచే అవకాశాలున్నాయని సమాచారం.
[ED Interrogate YS Avinash Reddy, ED Investigation, YS Vivekananda Reddy Murder Case, Money Laundering Probe, YCP MP Avinash Reddy, ED Interrogation Viveka Case, Telugu One]
http://www.teluguone.com/news/content/ed-interrogate-ys-avinash-reddy-25-234346.html





