వర్షాల కోసం కర్నాటకలో ఏం చేశారంటే?
Publish Date:Jul 6, 2026
Advertisement
వానళ్లు కురవాలి వానదేవుడా... అంటే కర్నాటకలోని ఓ గ్రామంలో వినూత్నంగా వరుణ దేవుడిని పూజించారు. ఆ గ్రామమంతా పెళ్లి సందడి నెలకొంది. పిల్లా, పెద్దా, ఆడా, మగా అందరూ కలిసి వరుణుడిని ప్రసన్నం చేసుకోవడానికి గార్ధభాలకు అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడలగి తాలూకా మున్యాళ గ్రామంలో ఈ అరుదైన వివాహం నిజంగానే జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ గ్రామస్థులు గాడిదలకు ఘనంగా వివాహం జరిపించారు. ఈ ఆచారం ఆ గ్రామంలో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని స్థానికులు చెప్పారు. ఆధునిక కాలంలోనూ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిర్వహించిన ఈ వినూత్న వివాహం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్‌గా మారింది. గ్రామస్థులు మగ గాడిదకు కాంతేశ్, ఆడ గాడిదకు కస్తూరి అని పేర్లు పెట్టి, నిజమైన పెళ్లి వేడుకను తలపించేలా, ఇంకా చెప్పాలంటే తలదన్నేలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి, వాటిని బంధువులు, గ్రామస్థులకు పంచి పెళ్లికి రండంటూ ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారుల సమక్షంలో మంగళసూత్రం కట్టించడం, తలంబ్రాలు పోయించడం, హారాలు మార్చించడం వంటి అన్ని వివాహ తంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. పెళ్లి వేడుకలో మహిళలు మంగళహారతులు పట్టగా, గ్రామ యువకులు డప్పుల చప్పుళ్లతో సందడి చేశారు. నవ దంపతులను ఆశీర్వదిస్తూ గ్రామస్థులు హర్షధ్వానాలు చేశారు. వివాహం అనంతరం గ్రామానికి వచ్చిన అతిథులందరికీ ఘనంగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గాడిదల పెళ్లి ఊరేగింపు, సంప్రదాయ పద్ధతిలో జరిగిన తంతు అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో వర్షాలు సరిగా కురవక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పూర్వీకుల కాలం నుంచి వస్తున్న విశ్వాసం ప్రకారం గాడిదలకు వివాహం జరిపిస్తే వర్షదేవుడు ప్రసన్నమై మంచి వర్షాలు కురుస్తాయని నమ్మకం ఉందన్నారు. ఆ విశ్వాసంతోనే గ్రామ ప్రజలంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.
http://www.teluguone.com/news/content/donkeys-marriage-in-karnataka-36-225222.html





