కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
.webp)
Advertisement
#కొత్త రక్తం మోజులో లోకేష్.. దూరమౌతున్న సీనియర్లు
#ఏ ఎమ్మెల్యేను కదిపినా వెళ్ల గక్కుతున్న అసంతృప్తి
#సీనియర్-జూనియర్ కాంబినేషన్ లేకుంటే ఎలా అంటూ విమర్శలు
త్వరలో టీడీపీ మహానాడు జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహానాడును కడపలో జరుపుకోబోతున్నారు. జరగబోయే మహనాడులో కడప బాంబుల్లాంటి విషయాలేం పేలతాయో..? ఎవరి గుండెల్లో మంటలు రేగుతాయో..? ఆ తర్వాత పరిణామాలు ఎలా దారి తీస్తాయోననే అంశంపై టీడీపీ సానుభూతిపరుల్లో ఓ రకమైన ఆందోళనతో కూడిన చర్చ జరుగుతోంది. అదేంటంటే సీనియర్లను సైడ్ చేస్తే ఎలా? అనేదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్. పెద్దలను గౌరవించాలని చెబతారు.. కానీ ఇప్పుడు టీడీపీలో ఆ పెద్దలకు సరైన గౌరవం లభించడం లేదనే చర్చ నడుస్తోంది. పాత నీరు పోవాలి.. కొత్త నీరు రావాలి అంటారు. కానీ రాజకీయాల్లో సీనియర్-జూనియర్ కాంబినేషన్ లేనిదే పార్టీ నడవడం కష్టం. రాజకీయాలు చేయడం కష్టం. దీనికి తాజా ఉదాహరణ వైసీపీనే. రాజకీయ పార్టీని నడిపే విషయంలో అంతగా అవగాహన లేని కారణంగా విఫల నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి ముద్ర వేయించుకున్నారు.
ఇప్పుడంతా పార్టీలో సీనియర్ల సంగతేంటీ అనే అంశం చుట్టే తిరుగుతోంది. పార్టీలో ఏ ఇద్దరు కలిసినా.. పార్టీలో సీనియర్ల సంగతేంటీ అనే దిశగానే చర్చ జరుగుతున్న వాతావరణమే కన్పిస్తోంది. పార్టీలో సీనియర్లుగా ఉన్న వారు నెమ్మదిగా సైడ్ కావడమో.. లేదా పార్టీ అధిష్టానమే సైడ్ చేయడమో జరుగుతోంది. పార్టీతో ప్రస్తుతం అంటీ ముట్టనట్టుగా ఉంటోన్న సీనియర్ల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు పార్టీ అధినాయకత్వానికి కళ్లు, ముక్కు, చెవులుగా ఉన్న యనమల, అశోక్ గజపతి రాజు, కళా వెంకట్రావు వంటి వారు ఇప్పుడు పార్టీ కార్యకలాపాలతో టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉంటున్నారు. ఈ ముగ్గురిలో కళా వెంకట్రావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా, తనకు తగ్గిన ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎంత వరకు ఉండాలో అంత వరకే పరిమితం అవుతున్నారు. వీలుంటే తన వారసుడికైనా సరైన ప్రాధాన్యత లభించే స్థానాన్ని కల్పిస్తే చాలునని భావిస్తున్నట్టు సమాచారం. ఇక అశోక్ గజపతి రాజు. ఈయన ఎన్నికలకు ముందు నుంచే నెమ్మదిగా పార్టీతో డిటాచ్ అవుతున్నట్టే కన్పించారు. ఎన్నికల తర్వాత పెద్దగా పార్టీ వ్యవహరాల్లో కన్పించడమే మానేశారు. యనమల అప్పుడప్పుడు కన్పిస్తున్నా.. పార్టీ అధిష్టానం ఆయనకు నెమ్మదిగా ప్రాధాన్యం తగ్గిస్తోంది. దీంతో ఆయన కూడా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరం అనే థియరీని పాటించడానికి అలవాటు పడుతున్నట్టు కన్పిస్తోంది. రాజ్యసభ వస్తే సరే సరి.. లేకుంటే రాజకీయాలకు సెలవని ప్రకటించేసే పరిస్థితి యనమల వైపు నుంచి ఇప్పటికే కన్పించింది. ఒకప్పుడు అసెంబ్లీలో స్పీకర్ అంటే ఇలా ఉండాలి అనేలా ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తీ, అన్ని కీలక సమాయాల్లో పార్టీకి సరైన సలహాలు, సూచనలు ఇచ్చిన పెద్దమనిషిని దూరం చేసుకోవడంపై కూడా కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది.
ఇక సీనియర్లుగా ఉండి.. సరైన పదవులు రాకుండా ఉన్న వారి జాబితాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణ మూర్తి, నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. వీరు గడచిన ఎన్నికల్లో గెలిచారు. అయినా వీరికి ఎలాంటి మంత్రి పదవులు దక్కలేదు. అయినా వీరిలో సోమిరెడ్డి, గోరంట్ల మినహా మిగిలిన ఇద్దరు పెద్దగా యాక్టివ్ గా కన్పించడం లేదు. సోమిరెడ్డి తన వారసుడికి సరైన దారి చూపించాల్సిన అవసరం కన్పిస్తోంది. అలాగే గోరంట్ల విషయానికొచ్చేసరికి.. ప్రస్తుతానికైతే.. ఆయనకు వారసులనే విధంగా ఎవ్వర్నీ ప్రొజెక్ట్ చేయలేదు. ఓ విధంగా చెప్పాలంటే 2029 ఎన్నికల నాటికి గోరంట్ల సైడ్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇక సీనియర్ నేతగా ఉన్న అయ్యన్నపాత్రుడుని స్పీకర్ ఛైరులో కూర్చొబెట్టడం ద్వారా ఆయన నోటికి తాళం వేసేసిన పరిస్థితి. వచ్చే ఎన్నికల నాటికి అయ్యన్న తప్పుకుని వారి కుమారులు తెర మీదకు వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఇక ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దేవినేని ఉమ పరిస్థితి అయితే కొడిగట్టిన దీపంలా మారింది. కానీ ఆయన మాత్రం పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు.
వీరు కాకుండా.. తెర వెనుక ఉండి.. పార్టీని ఓ దారిలో పెట్టడానికి.. పార్టీని వివిధ వేదికల మీద బాగా ఎలివేట్ చేయడానికి పని చేసిన కంభంపాటి రామ్మోహన్, టీడీ జనార్దన్ వంటి వారికి పార్టీలో అంతంత మాత్రం గౌరవమే దక్కుతోంది. టీడీ జనార్దన్ 2004-2014 అనేది టీడీపీకి చాలా టఫ్ టైం. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి టీడీ జనార్దన్ స్ట్రాంగ్ పిల్లర్ గా నిలిచారు. పార్టీ కార్యాలయ కార్యదర్శిగా అందర్నీ సమన్వయం చేసుకుంటూ.. పార్టీ కేడరుకు.. నేతలకు.. నేతలకు.. అధిష్టానానికి సంధానకర్తగా మారి.. అంతా తానై పార్టీని కాచుకుని పని చేశారు. ఇక 2019-24 మధ్య కాలంలో కూడా పార్టీ కోసం విశేషమైన సేవలే అందించారు. కానీ ఆయన్ను ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం ఆ రీతిలో గౌరవిస్తున్నదా..? అంటే లేదనే సమాధానమే వస్తున్నది. ఇక కంభంపాటి రామ్మోహన్. ఢిల్లీ స్థాయిలో కంభంపాటికి ఉన్న పేరు.. పరపతి సామాన్యమైనది కాదు. ఇప్పటికీ ఢిల్లీ స్థాయిలో టీడీపీకి కంభంపాటి తరహాలో లాబీయింగ్ చేసేవారు లేరు. వివిధ జాతీయ పార్టీలకు చెందిన అగ్ర నాయకులతో.. ఆ పార్టీల అధిష్టానాలతో నేరుగా మాట్లాడగల.. సంప్రదింపులు జరపగల నేర్పరితనం కంభంపాటికి ఉంది. కానీ కంభంపాటి సేవలను హైకమాండ్ సరిగా వినియోగించుకోవడం లేదనే చెప్పాలి. ఇలాంటి వారంతా సైడ్ అయిపోతే.. పరిస్థితేంటనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.
అయితే ఇప్పుడు ఈ స్థాయిలో పార్టీ వర్గాల్లో సీనియర్ల గురించి చర్చ జరగడానికి కారణాల్లేకపోలేదు. చాలా మంది సీనియర్ నేతలను మహానాడు తర్వాత పక్కకు పెట్టే అవకాశాలు కన్పిస్తుండడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటికే ప్రభుత్వంలో సీనియర్లకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. దాదాపు జూనియర్ టీం రాజ్యమేలుతోంది. ఇదే తరహాలో పార్టీలో కూడా చిన్నోళ్లకే పెద్ద బాధ్యతలు అప్పగించే దిశగా మహానాడులో యాక్షన్ ప్లాన్ ఉండి ఉండొచ్చనేది టీడీపీలో వినిపిస్తున్న టాక్. దీంతో సీనియర్లను ఈ స్థాయిలో సైడ్ చేయడం కరెక్టా అనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జూనియర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వడంలో తప్పు లేదు కానీ.. సీనియర్లను గౌరవించే విషయంలో టీడీపీ హైకమాండ్ సరైన కోణంలో ఆలోచించడం లేదేమోననేది అందరి మనస్సుల్లోనూ ఉన్న భావన. సీనియర్లను ఒక్కసారిగా సైడ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో జూనియర్లనే మంత్రులుగా చేయడం వల్ల.. ఊహించిన స్థాయిలో ప్రభుత్వానికి.. పార్టీకి మైలేజ్ రావడం లేదు. ఏం మాట్లాడినా.. చంద్రబాబు, లోకేష్ మాట్లాడితేనో.. ప్రెస్ మీట్ పెడితేనో తప్ప.. పెద్దగా ప్రజల్లోకి పోవడం లేదు. పైగా పార్టీకి ఎప్పుడైనా కష్ట కాలం వచ్చినా.. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా.. వాటిని జూనియర్లుగా ఉన్న వారు ఎంత వరకు డీల్ చేస్తారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. కనీసం మహానాడు జరగకముందే ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సీనియర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి, వారికి సముచిత బాధ్యతలు అప్పగించి, వారి సేవలు వినియోగించుకుంటే మంచిది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సీనియర్లు వ్యవహరించినంత సమయస్ఫూర్తితో జూనియర్లు వ్యవహరిస్తున్నారా? అంటే లేదనే సమాధానం వస్తుంది. ముఖ్యంగా మానవ సంబంధాలను మెయిన్ టెయిన్ చేయడంలో జూనియర్లు చాలా ఘోరంగా విఫలమవుతున్నారు. మనీ రిలేషన్స్ పెరిగాయని ప్రచారం జరుగుతోంది. లోకేష్ వెంట ఉండే ఇద్దరు అనుచరులు వల్లనే ఆయనపై ఈ ముద్ర పడుతోందని ఆయన శ్రేయోభిలాషులు అంటున్నారు. అలాగే తమ కోసం పని చేసిన వారెవ్వరు.. అనే విషయాన్ని ఆలోచించి.. ఆ కోణంలో నిర్ణయాలుతీసు కోవాలి కానీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఓ జూనియర్ మంత్రి వద్దకు వినతిపత్రం తీసుకెళ్తే.. ఆ వినతి పత్రాన్ని ఆయన ఎదుటే చించేసి.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటివి చూస్తుంటే.. జూనియర్ల చేతుల్లో పార్టీని పెడితే అది ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావడం లేదనే చర్చ జరుగుతోంది. పైగా జూనియర్ నేతల్లో చాలా మంది కమర్షియల్ యాంగిల్లో ఆలోచన చేస్తున్న వారే కన్పిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నంత వరకూ ఫర్వాలేదు కానీ.. రాజకీయంగా.. పార్టీ పరంగా చూసుకుంటే ఈ తరహా మనస్తత్వాలు ఉన్న వాళ్లు పార్టీని రన్ చేయడంలో కీలకంగా మారితే అది పార్టీకి అత్యంత ప్రమాదకర అంశంగా మారుతుందనేది చాలా మందిలో కన్పిస్తున్న ఆందోళన.
ఈ క్రమంలో ప్రభుత్వంలో ఎలా ఉన్నా.. పార్టీలో మాత్రం సీనియర్, జూనియర్ కాంబినేషన్ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు బలంగా వస్తున్నాయి. సీనియర్ల గైడెన్సుతో జూనియర్లు పని చేస్తే.. వారి అనుభవం.. వీరి ఉత్సాహం కలిసి పార్టీ అన్ని రకాలుగా నిలకడగా పరుగులు పెడుతుంది. సీనియర్ల పర్యవేక్షణలో జూనియర్లు పని చేస్తారు కాబట్టి.. కొంత కాలానికి జూనియర్లు కూడా అనుభవం గడిస్తారని అంటున్నారు. అయితే ఇవన్నీ చాలా మంది మనస్సులో ఉన్న ఆలోచనలు. వారు ఇస్తున్న ఫీడ్ బ్యాక్.. దీన్ని పార్టీ అధిష్టానం ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటుందో తెలియడం లేదంటున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగబోయే మహానాడులో కడప బాంబులు పేలతాయేమోననే ఆందోళన కన్పిస్తోంది
http://www.teluguone.com/news/content/dissatisfaction-in-tdp-about-seniors-sidelined-25-195849.html












