పోలవరం బిల్లుపై కాంగ్రెస్ మార్కు రాజకీయం!
Publish Date:Jul 14, 2014
Advertisement
పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. ఈ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం పొందితేనే ఈ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే రాజ్యసభలో అధికార ఎన్డీయే కూటమికి బలం తక్కువగా వుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే బిల్లు సులభంగా గట్టెక్కే అవకాశం వుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా ఇతర ఎన్డీయే యేతర పార్టీలన్నీ మద్దతు ఇస్తే బిల్లుకు ఆమోదం లభిస్తుంది. అయితే అన్ని పార్టీలను ఒకే తాటిమీద నడపటం కష్టమైన విషయం కాబట్టి బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు కోరడం తప్పనిసరి అవుతుంది. వాస్తవానికి ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభ్యంతరం లేకుండా మద్దతు తెలపాల్సిన అవసరం వుంది. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే హామీ ఇచ్చింది. అలాగే పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్స్‌ను జారీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా పోలవరం ముంపు గ్రామాల బిల్లుకు మద్దతు తెలపాల్సిన అవసరం వుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ దశలో తోక జాడిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే ఒక కీలకమైన తన డిమాండ్‌ని నెరవేర్చాలని మెలిక వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత మొత్తుకున్నా అధికార పార్టీ ముందు పప్పులు ఉడకటం లేదు. ఈ నేపథ్యంలో లోక్ సభలో తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోలవరం ముంపు గ్రామాల బిల్లుకు రాజ్యసభలో మద్దతు ఇస్తామని కాంగ్రెస్ లోపాయికారీగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తు్న్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్డీయే ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటున్నట్టు సమాచారం. వాస్తవానికి సోమవారం నాడు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాల్సి వుంది. ఏమవుతుందో చూడాలి.
http://www.teluguone.com/news/content/congress-politics-on-polavaram-bill-in-rajyasabha-45-35881.html





