బీజేపీ నా సీటు చోరీకి పాల్పడింది : మీనాక్షి నటరాజన్
Publish Date:Jun 21, 2026
Advertisement
బీజేపీ నా సీటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ అన్నారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి (ఆర్వో) తప్పుడు పద్ధతిలో తిరస్కరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను బీజేపీ తన స్వార్థ రాజకీయాల కోసం తుంగలో తొక్కిందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. కుదిరితే ఓట్లను దొంగిలిస్తోందని, అది సాధ్యం కాకపోతే ఏకంగా సీట్లనే దొంగిలిస్తోందంటూ "ఓటు చోరీ, సీటు చోరీ" అనే సరికొత్త నినాదంతో విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి, బీజేపీ అగ్ర నాయకత్వం అంతా కలిసి ఒక పథకం ప్రకారం కుట్ర పన్నారని మీనాక్షి ధ్వజమెత్తారు. దీన్ని ఒక సరికొత్త తరహా నేరంగా ("ఇన్నోవేటివ్ క్రైమ్") ఆయన అభివర్ణించారు. తెలంగాణలో తాము అధికారంలో ఉండటం బీజేపీ మరియు బీఆర్‌ఎస్ (BRS) పార్టీలకు అస్సలు నచ్చడం లేదని, తానే వారికి అతిపెద్ద అడ్డుగోడగా నిలిచానని మీనాక్షి స్పష్టం చేశారు. నామినేషన్ తిరస్కరణకు కాంగ్రెస్ నేతలే కారణమంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వెన్నుపోట్లు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలు కేవలం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్న నాటకాలని మండిపడ్డారు. ఈ కుట్ర వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అధికారులే అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని, నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఈ వివక్షకు, పక్షపాత వైఖరికి ప్రధానమంత్రిని మార్చడమే ఏకైక శాశ్వత పరిష్కారమని, భవిష్యత్తులో తాము ఆ పని చేసి తీరతామని ధీమా వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-36-223690.html





