లోక్‌సభ సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమే లేదు: సీఎం చంద్రబాబు
Publish Date:Nov 27, 2026
Advertisement
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలు పెరుగుతాయని, ప్రస్తుతం ఆయా రాష్ట్రాలకు ఉన్న ప్రాతినిధ్య నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన.. కేంద్ర మంత్రులు హెచ్డీ కుమారస్వామి, రామ్మోహన్ నాయుడుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో 129 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 50 శాతం పెంపుతో ఈ సంఖ్య 195కు చేరుతుందని చంద్రబాబు వివరించారు. దేశంలోని మొత్తం లోక్‌సభ స్థానాల్లో దక్షిణాదికి ప్రస్తుతం ఉన్న 23.76 శాతం వాటా యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు 38కి పెరుగుతాయని, మొత్తం లోక్‌సభ స్థానాల్లో రాష్ట్రానికి ఉన్న 4.6 శాతం వాటాలో మార్పు ఉండదని చెప్పారు. కర్ణాటకలో 28 నుంచి 42కు, తెలంగాణలో 17 నుంచి 26కు, తమిళనాడులో 39 నుంచి 59కు, కేరళలో 20 నుంచి 30కి స్థానాలు పెరుగుతాయని వెల్లడించారు. ప్రస్తుతం దేశ జనాభా, లోక్‌సభ స్థానాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిలో భారీ వ్యత్యాసం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 58.8 కోట్లు కాగా, అప్పట్లో 542 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని గుర్తుచేశారు. 2026 నాటికి దేశ జనాభా దాదాపు 147 కోట్లకు చేరిందని, అయినప్పటికీ లోక్‌సభ స్థానాలు 543 మాత్రమే ఉండటం సరైనది కాదన్నారు. 1971లో ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తే.. ప్రస్తుతం సుమారు 27 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారని వివరించారు. 50 శాతం సీట్ల పెంపుతో ఈ సంఖ్య 18 లక్షలకు తగ్గే అవకాశం ఉందన్నారు. గతంలో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేశాయని చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ కుటుంబ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రచార కార్యక్రమాల ద్వారా సంతానోత్పత్తి రేటును తగ్గించగలిగామని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా నియంత్రణతో పాటు జనాభా నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రోత్సాహకాలు అందించే విధానాలను కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది కూడ చదవండి: డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. 2051 వరకు రాష్ట్రాల ప్రాతినిధ్యం స్థిరం.! మహిళా రిజర్వేషన్ బిల్లు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందని, ఇప్పుడు దానిని అమలు చేసే దిశగా కీలక ముందడుగు పడుతోందని చంద్రబాబు అన్నారు. మహిళలకు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని, జనాభాలో సగం ఉన్న మహిళలకు సముచిత స్థానం దక్కాలని ఆకాంక్షించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చారిత్రక నిర్ణయాలు తీసుకుంటోందని చంద్రబాబు ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా దేశ శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు.. అందుకు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని మాత్రం సూచించడం లేదని విమర్శించారు. మహిళా బిల్లును మరోసారి అడ్డుకున్నా ఎన్డీయే ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మహిళల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో అన్ని పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మీకు నచ్చవచ్చు: డీలిమిటేషన్ ఎందుకు అవసరం: దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేదెలా.? మీకు నచ్చవచ్చు: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలా నష్టం...అసలు వివాదం ఏంటి? [ CM Chandrababu Naidu, Lok Sabha Seats Increase, Delimitation, Women Reservation Bill, South India, Andhra Pradesh, Narendra Modi, NDA Government ]
http://www.teluguone.com/news/content/cm-chandrababu-naidu-25-238102.html




