మిథున్ రెడ్డి అరెస్ట్?.. ఢిల్లీలో సీబీఐ బృందాలు?
Publish Date:Apr 7, 2025

Advertisement
ఇహనో.. ఇప్పుడో వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కానున్నారా? ఆంధ్రప్రదేశ్ సీఐడీ బృందాలు ఢిల్లీలో ఉండటానికి కారణం అదేనా. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ మంగళవారం(ఏప్రిల్ 7) విచారణకు రానుంది. అయితే ఇప్పటికే ఏపీ హైకోర్టు ఇదే విషయంలో మిథున్ రెడ్డి దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. ఎఫ్ఐఆర్ లో పేరే లేకుండా ముందస్తు బెయిలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పేరు ఎఫ్ ఐఆర్ లో లేదు. అయినా మిథున్ రెడ్డి సుప్రీంకు వెళ్లారు. ఆయన పిటిషన్ ను సుప్రీం మంగళవారం (ఏప్రిల్ 7) విచారించనుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీ చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా మిథున్ రెడ్డి అరెస్టు అవుతారా అన్న అనుమానాలనూ పెంచుతోంది.
ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖరరెడ్డి కర్త, కర్మ, క్రియగా జరిగిన ఏపీ మద్యం కుంబకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఉందని మాజీ ఎంపీ, వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ ఒకప్పటి నంబర్ 2 విజయసాయి మీడియా సమావేశంలో కుండబద్దలు కొట్టేశారు. ఇలా ఉండగా సీఐడీ కూడా తన దర్యాప్తులోఏపీ మధ్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రమేయానికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించిందని అంటున్నారు.
ఇక ఇప్పుడు మిథున్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. జగన్ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక అధికార కేంద్రంగా వెలుగొందారు. జగన్ ఐదేళ్ల పాలనలో పెద్దిరెడ్డి ఇష్టారీతిగా వ్యవహరించారు. అప్పట్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటూ పెద్ద పెద్ద సవాళ్లు సైతం చేశారు. అరాచకం సృష్టించడం, సొమ్ములు వెదజల్లడం ద్వారా కమ్మం మునిసిపాలిటీ అప్పట్లో వైసీపీ వశం కావడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర వహించారు. జగన్ ఐదేళ్ల పాలనలో పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అయితే అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ చిత్తుగా పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత నుంచీ పెద్దిరెడ్డిని గత పాపాలు వెంటాడుతున్నాయి. మీడియా పెద్దిరెడ్డి అరాచకాలు, నేరాలు, కుంభకోణాలను వెలికి తీసింది. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి పెద్దిరెడ్డిపై ఎటువంటి చర్యా లేదు. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన పెద్దిరెడ్డి అరెస్టు అయితే అది పెద్దిరెడ్డికి తన అరెస్టు కంటే పెద్ద శిక్షే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్టైతే పెద్దరెడ్డి ప్రతిష్ఠ మరింత మసకబారుతుందనడంలో సందేహం లేదు. అంతే కాకుండా కొడుకు జైలుపాలై ఇబ్బందులు ఎదుర్కోవడం కంటే తండ్రికి పెద్ద శిక్ష ఏముంటుందని అంటున్నారు.
అంతే కాకుండా తాజా పరిస్థితులను గమనిస్తుంటే.. ఒకప్పుడు జిల్లాను ఏలిన పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు అరెస్టు భయంతో వణికిపోతూ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. దాదాపుగా కుటుంబం మొత్తం రోడ్డున పడ్డ పరిస్థితి. గత ఏడాది ఎన్నికలలో పెద్దిరెడ్డి పుంగనూరు నుంచి ఎమ్మెల్యూగా, కుమారుడు మిథున్ రెడ్డి రాజం పేట నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఒక విధంగా విజయం సాధించడం అదృష్టమనే చెప్పాలి. వారి మెజారిటీలు గణనీయంగా తగ్గిపోయాయి. గత ఎన్నికలలో వారిద్దరి విజయం ఒక విధంగా చెప్పాలంటే చావు తప్పి కన్నులొట్టపోయిన సామెత చందమే. ముఖ్యంగా పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి విషయం తీసుకుంటే.. పుంగనూరులో పెద్దిరెడ్డి తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై కేవలం 6, 619 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
అలాగే రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి మిథున్ రెడ్డి విజయం కూడా అదృష్టమేనని చెప్పాలి. ఒక వేళ రాజంపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేసి ఉంటే మిథున్ రెడ్డి కచ్చితంగా ఓటమి పాలై ఉండేవారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం కూటమి పొత్తులో భాగంగా రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయడం వల్లే మిథున్ రెడ్డి విజయం సాధించారని స్థానికులు సైతం అప్పట్లో చెప్పారు. ఇప్పుడు తండ్రీ కొడుకులిరువురూ కూడా కేసుల ఉచ్చుల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. మద్యం కుంభకోణం విషయంలో అరెస్టు నుంచి రక్షణ కోసం మిథున్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పెద్దిరెడ్డి అయితే తన నివాసంలో జారి పడి చేయి విరక్కొట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ పై ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది.
http://www.teluguone.com/news/content/cid-teams-in-delhi-39-195748.html












