రాజ్యసభకు చింతకాయల విజయ్.. చంద్రబాబు నిర్ణయం వెనుక కారణమేంటంటే?
Publish Date:Jun 7, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు గానూ ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించగా ఆ పార్టీ తమ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ను ఎంపిక చేసింది. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక తెలుగుదేశం కూడా ఇద్దరు అభ్యర్థుల ఖరారు సజావుగా సాగిపోయింది. మూడో అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్ఠానం సమయం తీసుకుని మరీ చింతకాయల విజయ్ ను ఖరారు చేసింది. ఈ స్థానం కోసం చివరి నిముషం వరకూ టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పోటీ పడ్డారు. చివరికి పార్టీ అధినేత చంద్రబాబు చింతకాలయ విజయ్ కే మొగ్గు చూపారు. ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది. అందుకే ఉన్నత విద్యావంతుడు, ఇంగ్లీష్, హిందీ భాషలపై మంచి పట్టున్న నాయకుడు. ఢిల్లీ స్థాయిలో జాతీయ మీడియాతో మాట్లాడాలన్నా, పార్లమెంట్ లో పాయింట్ టు పాయింట్ వాదించాలన్నా విజయ్ లాంటి యంగ్ అయితేనే కరెక్ట్ ఆప్షన్ అని భావించి ఆయనను చంద్రబాబు రాజ్యసభకు ఎంపిక చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు.. సోషల్ మీడియా వేదికగానూ, క్షేత్రస్థాయిలోనూ టీటీడీ వాయిస్ ను ఐటీ వింగ్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చింతకాయల విజయ్ కీలక పాత్ర పోషించారు. యువతలో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. రాబోయే రోజుల్లో పార్టీని నడిపించే నెక్స్ట్ జనరేషన్ నాయకులను తయారు చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు చింతకాయల విజయ్ కు రాజ్యసభ ఇచ్చినట్లు చెబుతున్నారు. అదలా ఉంటే.. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల విమర్శలను ఒంటిచేత్తో తిప్పికొట్టిన వర్ల రామయ్యకు అన్యాయం జరిగినట్లేనని పార్టీలోని కొందరు అంటున్నారు. అయితే.. "వర్ల రామయ్య గారి సీనియారిటీకి తగని గౌరవం ఇస్తూనే.. ఆయన సేవలను పారటీ రాష్ట్ర రాజకీయాలలోనే ఎక్కువగా ఉపయోగించుకోవాలని భావిస్తోందని అధిష్ఠానం చెబుతున్నది. అలాగే . వర్ల రామయ్యకు ఎమ్మెల్సీగా అవకాశమో, కీలకమైన నామినేటెడ్ పదవో కట్టబెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అలాగే జాతీయ స్థాయిలో యువనాయకత్వానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకునే చింతకాయల విజయ్ కు రాజ్యసభ చాన్స్ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే.. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంలో చింతకాయల అయ్యన్నపాత్రుడి కుటుంబం పాత్ర ఉంది. ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. ఇప్పుడు చింతకాయల విజయ్ ను రాజ్యసభకు పంపడం ద్వారా జాతీయ స్థాయిలో బీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యత ఇఇచ్చినట్లు అవ్వడమే కాకుండా.. ఉత్తరాంధ్ర యువతకు ఈ నిర్ణయం ద్వారా పెద్ద పీట వేసినట్లు అవుతుంది.
http://www.teluguone.com/news/content/chintakayala-vijay-to-the-rajya-sabha-25-222134.html





