నేను ఒంటరి వాడిననుకొన్నారా?
Publish Date:Jun 8, 2015
Advertisement
తెదేపా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొన్న సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహా సంకల్పం భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు. ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “హైదరాబాద్ మరో తొమ్మిదేళ్ళ వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అక్కడ గౌరవప్రదంగా నివసించే హక్కు మా అందరికీ ఉంటుంది. హైదరాబాద్ మీ జాగీరు కాదని తెరాస నేతలు గుర్తుంచుకోవాలి. నేను ఏదో మామూలు వ్యక్తినని, ఒంటరి వాడిననే అపోహలో నన్ను ఏదో చేయాలనుకొంటే మీకే ప్రమాదం. నా వెనుక ఐదు కోట్లమంది ప్రజలున్నారు. నేను వారందరికీ ప్రతినిధిని, వారు ఎన్నుకొన్న ముఖ్యమంత్రిని. కనుక నాతో చెలగాటమాడోద్దని అందరినీ హెచ్చరిస్తున్నాను. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రినయిన నా ఫోనే ట్యాపింగ్ చేసే దుస్సాహాసం చేసారు. అందుకు వారు తగిన శిక్ష అనుభవించక తప్పదు. నాతో పెట్టుకొంటే కబడ్ధార్ జాగ్రత్త! నీకు పోలీసులు ఉన్నట్లే నాకూ పోలీసులు ఉన్నారు. నీకు ఎసిబి ఉన్నట్లే నాకూ ఎసిబి ఉంది. తలుచుకొంటే నేను తగిన విధంగా బుద్ధి చెప్పగలను. కానీ గౌరవనీయమయిన ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ అటువంటి నీచ రాజకీయాలు, కుట్రలు చేయడం భావ్యం కాదనే ఉద్దేశ్యంతోనే మీ ఆటలన్నీ సహిస్తున్నాను." "రాజకీయాలు చేయడం కాదు రాష్ట్ర అభివృద్ధిలో నాతో పోటీపడమని అధికారం చేప్పట్టిన మొదటి రోజే నేను కేసీఆర్ కి సవాలు విసిరాను. కానీ అతను నాతో పోటీ పడలేకనే ఈవిధమయిన కుట్రలు పన్నుతున్నాడు. ఎవరింట్లో అయినా శుభకార్యం జరుగుతోంది అంటే బుద్దున్నవాడెవడూ దానిని చెడగొట్టాలనుకోడు. కానీ కేసీఆర్ మాత్రం ఓవైపు సంబరాలు చేసుకొంటూ మా మహాసంకల్ప కార్యక్రమానికి చెడగొట్టాలని ప్రయత్నించాడు. అక్కడ ట్యాంక్ బ్యాండ్ మీద కూర్చొని టీ-న్యూస్ ఛానల్లో ఆడియో టేపులు అంటూ ఏవో రిలీజ్ చేయించాడు. వాటిని చూసి నేనేదో భయపడిపోతాననుకొన్నాడు కానీ నేను బులెట్ లా దూసుకుపోతాను. ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి?" అని ప్రశ్నించారు. "అసలు మా యంయల్యేలని కొనుకొన్నది నువ్వు కాదా...అని అడుగుతున్నాను. మా పార్టీ జెండాతో యంయల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మంత్రిగా ఉంచుకొన్న నువ్వా నాకు నైతిక విలువల గురించి పాఠాలు చెప్పేది? అతను నేటికీ సిగ్గు లేకుండా తెదేపా యం.యల్యేగా కొనసాగుతుంటే ఎందుకు రాజీనామా చేయించడంలేదు?అదేనా నైతిక విలువలు పాటించడమంటే?రాజకీయాల గురించి, నైతిక విలువల గురించి నీ నేను దగ్గర పాఠాలు నేర్చుకోవలసిన ఖర్మ నాకు పట్టలేదు. ఇప్పటికయినా ఇటువంటి పిల్లచేష్టలు కట్టిపెట్టి బాధ్యత గల ముఖ్యమంత్రిగా వ్యవహరించడం నేర్చుకో,” అని చంద్రబాబు నాయుడు గట్టిగా హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-39-47192.html





