జగన్ కి కేంద్రం బిగ్ షాక్.. తెలంగాణకే స్టీఫెన్!!
Publish Date:Sep 4, 2019
Advertisement
సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్ మీద ఏపీకి పంపడానికి కేంద్రం నిరాకరించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పని చేస్తున్న స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్ మీద ఏపీకి పంపాలని ఆంధ్రా సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ముందే జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరారు. ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఆయన్ను నియమించాలని జగన్ భావించారు. దానికి కేసీఆర్ కూడా ఓకే చెప్పారు. దీంతో కేంద్రం ఆమోదం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లేఖలు రాశాయి. 15 రోజుల్లో హోంశాఖ నుంచి అనుమతి లభిస్తుందని భావించాయి. కానీ ఇన్నాళ్లూ స్టీఫెన్ రవీంద్ర డిప్యూటేషన్ అంశాన్ని పెండింగ్‌లో పెట్టిన హోం శాఖ.. ఆయన్ను ఏపీకి పంపడానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్ మీద ఏపీకి పంపాలని జగన్.. కేసీఆర్ ని కోరిన వెంటనే రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వెంటనే జగన్‌ను కలిసిన స్టీఫెన్.. ఏపీలో అనధికారికంగా విధులు నిర్వర్తించారని వార్తలు వచ్చాయి. మూడు నెలల పాటు ప్రతి 15 రోజులకు ఒకసారి తన సెలవును రెన్యూవల్ చేసుకుంటూ వచ్చిన ఆయన.. పూర్తిగా ఏపీ పరిస్థితులపైనే ఫోకస్ చేసినట్లు సమాచారం. అయితే ఇన్ని రోజుల పాటు సెలవులో కొనసాగిన స్టీఫెన్ రవీంద్ర.. ఈ సారి సెలవులు పొడిగించుకోకుండా.. మంగళవారం తిరిగి తెలంగాణలో తన విధుల్లో చేరిపోయారు. దీన్నిబట్టి చూస్తుంటే స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్ మీద ఏపీకి పంపడానికి కేంద్రం నిరాకరించినట్టు అర్థమవుతోంది. ఒక ఐపీఎస్ అధికారి అంతరాష్ట్ర బదిలీ గురించి స్వయంగా సీఎం అభ్యర్ధించినా కేంద్రం సానుకూలంగా స్పందించకపోవటం పైన ఇప్పుడు చర్చ సాగుతోంది. ఏపీలో అనేక మంది అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా జీఏడీకీ.. డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంగా అనేక మంది అధికారులను ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. ఇక, కొత్త ప్రభుత్వం ఏపీలో కొలువు తీరిన తరువాత అనేక మందికి పోస్టింగ్ లేకుండా రిజర్వ్ లో ఉంచింది. దీంతో ఇంత కాలం పాటు సివిల్ సర్వీసు అధికారులను పక్కన పెట్టటం పైన కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. వారిని కాదని పక్క రాష్ట్రంలో పని చేస్తున్న అధికారిని తెచ్చుకొని పోస్టింగ్ ఇవ్వటం పైన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే స్టీఫెన్ ఫైల్ తిరస్కరించినట్లుగా చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/centre-stops-stephen-ravindra-deputation-39-89041.html





