విలీనం కాదు పొత్తే!?
Publish Date:Aug 16, 2024
Advertisement
బీఆర్ఎస్, బీజేపీ బంధం తొలి నుంచీ కూడా పలు అనుమానాలకు తావిచ్చే విధంగానే ఉంది. 2023 ఎన్నికలకు ముందు ఉప్పు, నిప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకున్నప్పటికీ, బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య గట్టి బాండ్ ఉందన్న ఆరోపణలు వినిపించాయి. విమర్శల పర్వం అంతా ఎలక్షన్ స్ట్రాటజీయేననీ, కాంగ్రెస్ ను బలహీనం చేయడానికే ఇరు పార్టీలూ ప్రధాన ప్రత్యర్థులుగా ప్రజలను నమ్మించడానికి చేసిన ప్రయత్నమేననీ అప్పట్లో పరిశీలకులు కూడా విశ్లేషణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాను అధికారంలో ఉండగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ దేశ వ్యాప్తంగా పర్యటనలు జరిపిన సంరద్భంగా కూడా ఆయన కలిసిన రాజకీయ పార్టీల నేతలెవరయ్యా అంటూ వారంతా బీజేపీ వ్యతిరేక పర్టీలకు చెందిన వారే. అంటే కాంగ్రెస్ కూటమికి దగ్గరగా ఉన్నవారే. దీంతో అప్పట్లోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆకాంక్షపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైకి తీవ్రమైన బీజేపీ వ్యతిరేకత ప్రదర్శిస్తూ.. లోలోపల కేసీఆర్ చేసిందంతా ఆ పార్టీకి అనుకూలమైన పనులేనని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. అలా చేయడం ద్వారా మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టు కాకుండా కాపాడుకునేందుకేనని వారు అప్పట్లో పేర్కొన్నారు. వాస్తవంగా అప్పట్లో అంటే ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలయ్యే వరకూ కవిత అరెస్టు కాలేదు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేయడానికి పార్టీని బీజేపీలో విలీనం చేసి రక్షణ పొందాలని కేసీఆర్ భావిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చాలా గట్టిగా ఖండించారు. అదే సమయంలో విలీనం కాదు పొత్తు అని అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో పారాజయం పాలై బీఆర్ఎస్ గద్దె దిగింది. ఆ తరువాత ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీనిపై కేటీఆర్ తనదైన శైలిలో చెప్పిన భాష్యమే బీఆర్ఎస్, బీజేపీల రహస్య బంధాన్ని బట్టబయలు చేసింది. సార్వత్రిక ఎన్నికలలో ఏ కూటమిలోనూ లేని పార్టీలను జనం ఆదరించలేదని తమ పార్టీ జీరో పెర్ఫార్మెన్స్ కు కారణంగా కేటీఆర్ భాష్యం చేప్పారు. వాస్తవానికి బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఎమ్మెల్యేలు, కీలక నేతలు క్యూ కట్టి మరీ కాంగ్రెస్ లో చేరుతున్నారు. బీఆర్ఎస్ ఒంటరిగా మనగలగడం అసాధ్యమని వారు బాహాటంగానే చెబుతున్నారు. నేతలు వరుసగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో వారిని కాపాడుకునేందుకు భవిష్యత్ లో బీజేపీతో కలిసి పని చేస్తామని కేటీఆర్ చెప్పకనే చెబుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ విలీనం అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. అలాగే త్వరలో రాష్ట్రంలో పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్, బీజేపీల మధ్య పరస్పర సహకారం ఇరు పార్టీలకూ అవసరం. ఈ కారణంగానే విలీనం లేదంటూనే పొత్త తథ్యమన్న సంకేతాలను కేటీఆర్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/brs-and-bjp-alliance-25-183041.html





