బోండా ఉమ డిసైడైపోయారు.!
Publish Date:Jul 28, 2026
Advertisement
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో వైసీపీనాయకులతో కలిసి వేదిక పంచుకోవడం, అక్కడ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో బోండా ఉమా నుంచి వివరణ కోరింది. ఈ విషయంపై సీనియర్ జర్నలిస్టు కృష్ణాంజనేయులు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బోండా వైఖరిని చూస్తుంటే ఆయన తెలుగుదేశం కు గుడ్ బై చెప్పడానికి డిసైడైనట్లే కనిపిస్తోందన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొన్న బోండా ఉమా, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడమే కాకుండా, విజయవాడలో ముద్రగడ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఎమ్మెల్యే హోదాలో అక్కడ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న నాయకులతో కలిసి బోండా ఉమా ఒకే వేదికపైకి రావడం రాజకీయ చర్చకు తావిచ్చింది. బోండా తీరుపై తెలుగుదేశం అధినేత సీరియస్ అయ్యారు. పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే బోండా ఉమా కూడా తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు. గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణాంజనేయులు.. బోండా వ్యవహారం కేవలం ముద్రగడ సంస్మరణ లో వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడానికి మించి రాజకీయ వ్యూహం ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మొదటి విడత మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న బోండా ఉమ ఆ అసంతృప్తిని ఇలా వ్యక్తం చేయడమే కాకుండా.. పార్టీని వీడతానని సంకేతాలు ఇవ్వడం ద్వారా అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావడానికి చూస్తున్నారనీ, అయితే గతంలో ఇటువంటి ఒత్తిడులకు చంద్రబాబు లొంగి ఉండొచ్చు కానీ, ఇప్పుడా పరిస్థితి లేదని కృష్ణాంజనేయులు అన్నారు. అందుకే ఒక వేళ ఒత్తిడికి చంద్రబాబు లొంగకుంటే.. తన భవిష్యత్ రాజకీయ అడుగుల ఎటు వేయాలన్న నిర్ణయానికి బోండా ఉమ ఇప్పటికే వచ్చేసి ఉంటారని కృష్ణాంజనేయులు అన్నారు. కూటమి రాజకీయంలో సామాజిక వర్గాల సమతుల్యత కూడా ఈ వివాదానికి ఒక కారణమని పేర్కొన్నారు. జనసేన పార్టీతో పొత్తు ఉన్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో టీడీపీ పరిమితులు ఎదుర్కొంటోందనీ, దీనిని ఆసరాగా చేసుకుని విపక్షాలు టీడీపీలోని అసంతృప్త కాపు నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రయత్నంలో వైసీపీ వలకు బోండా ఉమ చిక్కారని కృష్ణాంజనేయులు విశ్లేషించారు. Bonda Uma, Telugu Desam Party, Vijayawada Politics, Ambati Rambabu, Andhra Pradesh News
http://www.teluguone.com/news/content/bonda-uma-decided-his-future-political-steps-25-227388.html





