ఏసీబీ ముందుకు బీఎల్ఎన్ రెడ్డి
Publish Date:Jan 10, 2025
Advertisement
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణకు శుక్రవారం (జనవరి 10) హాజరయ్యారు. రేసు జరిగిన సమయంలో ఆయన హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ గా ఉన్నారు. ఆ సమయంలో రేసును నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ ఖాతా నుంచి నగదు బదిలీ చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉండగా... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ2గా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ లను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కేటీఆర్ ను ఏసీబీ అధికారులు గురువారం (జనవరి 9) దాదాపు ఏడు గంటల సేపు విచారించారు. విచారణ అనంతరం కేటీఆర్ తాను ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించినట్లు చెప్పుకున్నారు. అయితే ఏసీబీ మాత్రం కేటీఆర్ తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదనీ, మరో సారి విచారణకు పిలుస్తామని చెబుతున్నారు. ఇప్పుడు బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారిస్తున్నది. ఈ సందర్భంగా ఆయన ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ మరోసారి విచారించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/blnreddy-attend-acb-inquiry-39-191136.html





