పెన్షన్ పైసల కోసం వెళ్తే అకౌంట్‌లో రూ.759 కోట్లు.. అవాక్కైన వృద్ధుడు..!
Publish Date:Jul 13, 2026
Advertisement
బిహార్‌లో అంతుచిక్కని ఒక వింత సంఘటన వెలుగుచూసింది. సాధారణంగా నెలానెలా వచ్చే స్వల్ప పెన్షన్ డబ్బుల కోసం వెళ్లిన ఒక వృద్ధుడికి, తన జీవితంలో ఎన్నడూ ఊహించని షాక్ తగిలింది. ఆయన బ్యాంకు అకౌంట్‌లో ఏకంగా వందల కోట్లు జమ కావడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన కమేశ్వర్ మిశ్రా (82) అనే వృద్ధుడికి సాహిత్యం అంటే ఇష్టం, ఆయన వృత్తిరీత్యా కవి. ఆయన తన వృద్ధాప్య పించను సొమ్మును డ్రా చేసుకోవడం కోసం స్థానికంగా ఉండే ఒక కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) కు వెళ్లారు. ఆయనతో పాటు శారీరక వికలాంగుడైన ఆయన కుమారుడు కూడా తన పింఛన్ కోసం అక్కడికి చేరుకున్నారు. కేంద్రంలో తమకు రావలసిన పింఛను మొత్తాన్ని తీసుకున్న తర్వాత, కమేశ్వర్ మిశ్రా సరదాగా తన అకౌంట్ లో ఎంత నిల్వ ఉందో ఒకసారి చూపించమని అక్కడి ఆపరేటర్‌ను కోరారు. ఆపరేటర్ కంప్యూటర్ స్క్రీన్ పై బ్యాలెన్స్ వివరాలను చూడగానే ఒక్కసారిగా అవాక్కయ్యారు. స్క్రీన్ మీద కమేశ్వర్ మిశ్రా ఖాతాలో ఏకంగా రూ. 759,69,51,951 (రూ. 759 కోట్లకు పైగా) ఉన్నట్లు చూపించింది. ఈ అంకెలను చూసి నమ్మలేకపోయిన సదరు వృద్ధుడు, పక్కనే ఉన్న తన కుమారుడి అకౌంట్ బ్యాలెన్స్ కూడా ఒకసారి సరిచూడాలని కోరారు. కట్ చేస్తే.. కుమారుడి ఖాతా తెరిచి చూడగా అందులోనూ దాదాపు అంతే మొత్తంలో డబ్బు జమ అయినట్లు తేలింది. ఇలా తండ్రీకొడుకులు ఇద్దరి బ్యాంకు ఖాతాలలో కలిపి మొత్తంగా రూ. 1,500 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు డిజిటల్ స్క్రీన్ పై కనిపించడంతో ఆ కుటుంబంతో పాటు సీఎస్‌సీ కేంద్ర నిర్వాహకులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ అసాధారణమైన విషయంపై కమేశ్వర్ మిశ్రా బహిరంగంగా స్పందించారు. తమ లాంటి సామాన్యుల ఖాతాల్లోకి ఇంత భారీ మొత్తంలో నిధులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. ఇది కచ్చితంగా బ్యాంకింగ్ వ్యవస్థలో దొర్లిన ఏదో ఒక పెద్ద పొరపాటేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై సంబంధిత బ్యాంకు యాజమాన్యం కానీ, ఉన్నతాధికారులు కానీ తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని వృద్ధుడు కోరారు. ఈ డిజిటల్ లోపాన్ని వెంటనే సరిదిద్దాలనే ఉద్దేశంతోనే తాను స్వచ్ఛందంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు లేదా సాంకేతిక లోపాలు (గ్లిచ్) తలెత్తినప్పుడు ఇలాంటి అంకెల తారుమారు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనపై సదరు బ్యాంకు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాబోయే రోజుల్లో బ్యాంకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
http://www.teluguone.com/news/content/bihar-bank-account-glitch-36-225829.html





