కోటి రూపాయల డిమాండ్.. చివరకు అధికారి ఆత్మహత్య.!
Publish Date:Oct 18, 2026
Advertisement
భద్రాచలంలో పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పాల్వంచలోని సివిల్ సప్లైస్ గ్యాస్ గోడౌన్ మేనేజర్‌గా పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ అనంత లక్ష్మీనారాయణ.. భద్రాచలంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. తన మృతికి పలువురు కారణమంటూ ఆయన రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అందులో ఏడుగురి పేర్లు ప్రస్తావించినట్లు సమాచారం. ఆర్థిక వ్యవహారాలే వివాదానికి కారణమా.? తన కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ రజితతో పాటు మరికొందరు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని లక్ష్మీనారాయణ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేయడం, ఇతర మార్గాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు తాను సహకరించలేదనే కారణంతో తనపై కక్ష పెంచుకున్నారని ఆరోపించినట్లు సమాచారం. ఈ క్రమంలో తనను మానసికంగా వేధించారని, కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు కూడా లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. బదిలీ కోసం పలుమార్లు విజ్ఞప్తి.! పాల్వంచ గ్యాస్ కార్యాలయంలో విధులు నిర్వహించడం కష్టంగా మారిందని, తనను మరో కార్యాలయానికి బదిలీ చేయాలని పలుమార్లు ఉన్నతాధికారులను కోరినట్లు లక్ష్మీనారాయణ తన లేఖలో వివరించారు. కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2025లోనే జిల్లా మేనేజర్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా మేనేజర్‌కు బదిలీ కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. 21 రోజుల సెలవు అనంతరం తిరిగి విధుల్లో చేరినప్పటికీ తన సమస్యకు పరిష్కారం లభించలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కార్యాలయానికి వచ్చి బెదిరించారని ఆరోపణ.! 2026 అక్టోబర్ 16న రజిత భర్త, రిపోర్టర్ నాయిని రాజేష్, నాగచందు తదితరులు పాల్వంచ గ్యాస్ కార్యాలయానికి వచ్చి తనను దూషించడంతో పాటు చంపుతామని బెదిరించినట్లు లక్ష్మీనారాయణ ఆరోపించినట్లు సమాచారం. ఈ ఘటన కార్యాలయ సిబ్బంది, గ్యాస్ డెలివరీ సిబ్బంది సమక్షంలో జరిగిందని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, తనపై లైంగిక వేధింపులకు సంబంధించి రజిత సెప్టెంబర్ 30న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు, అక్టోబర్ 16న అంతర్గత ఫిర్యాదుల కమిటీ కార్యాలయ సిబ్బందిని విచారించినట్లు కూడా సూసైడ్ నోట్లో ప్రస్తావించినట్లు సమాచారం. తనపై వచ్చిన ఆరోపణలను లక్ష్మీనారాయణ ఖండించినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుకు సంబంధించిన వాస్తవాలు, ఇరు పక్షాల వాదనలు అధికారిక విచారణలో తేలాల్సి ఉంది. సూసైడ్ నోట్లో పలువురి పేర్లు.! తన ఆత్మహత్యకు పలువురు కారణమంటూ రాజలపూడి రజిత, నాయిని రాజేష్, నాగచందు, కలీం, బిగ్ టీవీ వెంకన్న, టీవీ9 రవి తదితరుల పేర్లను సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం. తనను పాల్వంచ కార్యాలయం నుంచి బదిలీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, తన మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, సూసైడ్ నోట్లోని ఆరోపణలను పరిశీలించాల్సి ఉంది. అధికారి మరణానికి దారితీసిన పరిస్థితులు, ఆయన చేసిన ఆరోపణల్లోని వాస్తవాలు, సంబంధిత ఫిర్యాదుల వెనుక ఉన్న అంశాలు విచారణలో తేలాల్సి ఉన్నాయి. [ Bhadrachalam Officer Suicide, Anantha Lakshminarayana, Palwancha Civil Supplies, Suicide Note, Telangana News, Civil Supplies Department, Police Investigation, Workplace Harassment Allegations ]
http://www.teluguone.com/news/content/bhadrachalam-officer-suicide-24-234739.html




