తెరపైకి మరో స్పాన్సర్డ్ పార్టీ ?
Publish Date:Jan 6, 2023
Advertisement
తెలంగాణలో ఇప్పటికే లెక్కకు మించి పార్టీలున్నాయి. మరో వంక ఏపీతో సమానంగా తెలంగాణలోనూ పటిష్ట పునాదులున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే, ఏపీలో బీజేపీ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన తెలంగాణలో ఒంటరి పోరాటానికి సిద్డమవుతోంది. గత ఎన్నికల నాటికి లేని వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ కొత్తగా తెరపై కొచ్చింది. కేఏ పాల్ పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ, ఇంటి పార్టీ, కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితి ( టీజేఎస్) .. ఐపీస్ మాజీ అధికారి, ఆర్ ఎస్ ప్రవీణ కుమార్ సారధ్యంలో కొత్తగా అడుగులు వేస్తున్న బీఎస్పీ .. ఇలా చెప్పుకుంటూపోతే .. చాలా చాలా పార్టీలే ఉన్నాయి. అయితే అందులో ఎన్ని పార్టీలు ఎన్నికల రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటున్నాయి? ఏయే పార్టీలు, పరోపకారార్ధం పుట్టుకొస్తున్నాయి, స్పాన్సర్డ్ పార్టీలు ఎన్ని, అనేది చెప్పడం కొంచెం కష్టం. అయినా, మంది పెరిగే కొద్ది మజ్జిగ పలచనవుతుంది,అనేది మాత్రం నిజం.అందుకే, అధికార బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక, ప్రతిపక్ష అనుకూల ఓటును సాధ్యమైన మేరకు ముక్కలు ముక్కలు చేసేందుకు, చీల్చేందుకు, కొన్ని పార్టీలను స్పాన్సర్ చేస్తోందనే విమర్శ చాలా కాలంగా వినవస్తోంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా, కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు, ఆ పార్టీల పట్ల అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వం యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే, ఏ పార్టీని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఎవరు ఎవరు వదిలిన బాణమో .. అర్థం చేసుకోవడం కష్టం కాదని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. అదలా ఉంటే, తెలంగాణ రాజకీయ ముఖ్య చిత్రంలో, త్వరలోనే, బీఆర్ఎస్ చెప్పుచేతల్లో పనిచేసే మరో స్పాన్సర్డ్ పార్టీ తెర మీదకు వస్తుందని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో సంక్రాంతి తర్వాత మరో కొత్త ప్రాంతీయ పార్టీ రాబోతోందని మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే బీజేపీ నేత ఉభయ తెలుగు రాష్టాలకు సంబంధించి మరో కీలక కీలక వ్యాఖ్య చేశారు.ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిపాలనను పక్కన పెట్టి, ఎన్నికల రాజకీయాలలో తల మునకలయ్యారని, ఆ ఇద్దరి పరస్పర సహకారంతో పార్టీలను పుట్టిస్తున్నారని అంటున్నారు. కాగా, ప్రభాకర్ ఏ పార్టీ గురించి ఈ వ్యాఖ్య చేశారనే విషయం పక్కన పెడితే, ఏపీకి చెందిన ఒక ముఖ్య నేత సారథ్యంలో తెలంగాణలో కొత్త పార్టీ పుట్టుకోస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని 27 నియోజక వర్గాల్లో ఆంధ్రా సెటిలర్ల ఓటును చీల్చే లక్ష్యంతో, ఈ కొత్త పార్టీ పుట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్న నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త పార్టీని తెర మీదకు తెస్తున్నారని అంటున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం, ఒక సారి ప్రజల్లో వ్యతిరేకత వస్తే, బ్యాలెట్ పేపర్ మీద ఎన్ని పార్టీలు, ఎన్ని గుర్తులున్నా, అధికార పార్టీని ఓడించే పార్టీని గుర్తించి, గురి చూసి ఓటు వేస్తారని అంటున్నారు. అలాగే ఎన్నికల రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ రెండు కావాలన్న నియమం లేనట్లే, మైనస్ ప్లస్ మైనస్ .. మైనస్ కావాలనే నియమం లేదని.. అంటున్నారు.
http://www.teluguone.com/news/content/another-sponsored-party-in-telangana-39-149609.html





