మునిసిపోల్స్ లో ఘోర పరాజయం: అంబటి నోట పరాజయం మాట: ఓటమి ఒప్పుకోలు.!
Publish Date:Nov 4, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయం చవిచూసిందని వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల్లో అధికార తెలుగుదేశం కూటమి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూనే, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నామని చెప్పారు. తద్వారా గతంలో తాము అక్రమాలు చేశామని అంగీకరించారు. విశేషమేంటంటే.. ఆయనీ ఓటమి ఒప్పుకోలు హైదరాబాద్లో ఈడీ విచారణకు హాజరై బయటకు వచ్చిన తరువాత జరిగింది. ఈడీ విచారణ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన అంబటి, రాష్ట్రంలో ఏ ఎన్నికలు నిర్వహించినా ప్రజల నుంచి ఇదే రకమైన తీర్పు వస్తుందని, ఫలితాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని చెప్పారు. వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓ వైపు వైసీపీ అధినేత జగన్.. ఎన్నికల్లో అక్రమాలు, అధికార తెలుగుదేశం కూటమి దౌర్జన్యాల కారణంగానే ఫలితాలు ఇలా వచ్చాయనీ, పోలీసులు, ఎన్నికల సంఘం, బాబు టీమ్ గా ఏర్పడి మునిసిపోల్స్ ను ఎలక్షన్ గా కాకుండా సెలక్షన్ గా మార్చేశారని విమర్శిస్తుంటే, ఆ పార్టీ సీనియన్ నాయకుడు, కీలక నేత అంబటి.. మాత్రం ప్రజాక్షేత్రంలో వైసీపీపై ఉన్న వ్యతిరేకత కారణంగానే ఓటమి పలయ్యామని అంగీకరించడం గమనార్హం. జరిగిన పరిణామాలే నేడు పార్టీకి ఈ గతి పట్టించాయని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా ఇదే సందర్భంగా మద్యం రవాణాకు సంబంధించిన ఈడీ విచారణ వివరాలను కూడా అంబటి వెల్లడించారు. తన నియోజకవర్గ పరిధిలోని వైకాపా నాయకులు సుబ్బారెడ్డి, పురుషోత్తంలకు మద్యం రవాణాకు సంబంధించి సబ్ కాంట్రాక్టులు ఇప్పించేందుకు తాను సిఫారసు చేసినట్లు అంగీకరించారు. ఈ విషయమై అప్పట్లో వాసుదేవరెడ్డితో మాట్లాడానని కూడా అంగీకరించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈడీ అధికారులకు వివరించినట్లు చెప్పారు. తాను సిఫారసు చేసిన వ్యక్తులకు కాంట్రాక్టులు దక్కాయని, వాటిని సుమారు ఐదేళ్లపాటు నిర్వహించగా రూ.16 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు టర్నోవర్ నమోదైందన్న అంబటి, అయితే ఈ ఆర్థిక లావాదేవీలలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలతో అధికారుల దర్యాప్తులో భాగంగానే తాను విచారణకు హాజరైనట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా అధికారులు తన ఆధాన్, పాన్ కార్డు వివరాలను సేకరించారని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒకవైపు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో, అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే నేడు పార్టీ ఓటమికి కారణమని విపక్ష నేత స్వయంగా అంగీకరించడం గమనార్హం. ఒకవైపు ఈడీ విచారణ ఎదుర్కొంటూనే మరోవైపు ఎన్నికల పరాజయంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. [Ambati Rambabu On AP Municipal Elections, Accepts YCP Defeat, Ambati Rambabu ED Inquiry Hyderabad, Andhra Pradesh Politics, Telugu One]
http://www.teluguone.com/news/content/ambati-rambabu-on-ap-municipal-elections-39-236348.html





