మళ్లీ నోరు పారేసుకున్న అంబటి!
Publish Date:Jun 13, 2026
Advertisement
వైసీపీ అనుచిత వ్యాఖ్యల పర్వం కోనసాగుతోంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రిపై అభ్యంతరకర పదజాలంతో మాట్లాడినందుకు అంబటి రాంబాబు అరెస్టు అయ్యి, బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న అంబటి ఇప్పుడు మరో సారి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలతోరెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో భాగంగా ఒక ధర్నాలో పాల్గొన్న అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిరసనల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన అంబటి.. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాడిని ఎప్పుడో తగలేశారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ మర్యాదలను, నైతిక విలువలను పూర్తిగా కాలరాయడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంబటి రాంబాబు ఈ రకంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన బహిరంగ సభల్లో, మీడియా సమావేశాలలో పలు మార్లు హద్దులు దాటి మాట్లాడారు. గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల వల్లే గుంటూరు కోర్టు పరిధిలో ఆయనపై కేసులు నమోదై, తీవ్ర చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కొని జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే పంథాలో బహిరంగంగా ముఖ్యమంత్రిని దూషించడంతో.. అంబటి రాంబాబును తక్షణమే అరెస్ట్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/ambati-crosses-line-again-25-222806.html





