కేటీఆర్ ఫామ్‌హౌస్ కూల్చేస్తారు!
Publish Date:Aug 16, 2024
Advertisement
హైదరాబాద్ శివార్లలో వున్న జన్వాడలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ముచ్చటపడి కట్టుకున్న ఫామ్‌హౌస్‌ని కూల్చడానికి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నగరం పక్కనే వున్న జంట జలాశయాల పరిధిలోని 111 జీవో కిందకి వచ్చే భూమిలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పాతిక ఎకరాల భూమిని కష్టపడి సంపాదించుకున్నారు. ఆ భూమిలో కట్టడాలు నిర్మించడానికి వీల్లేదు. అయితే కేటీఆర్ మాత్రం ఎంచక్కా ఫామ్‌హౌస్ పేరుతో బిల్డింగ్స్ కట్టుకున్నారు. ఈ ఫామ్‌హౌస్ విజువల్స్‌ని డ్రోన్ ద్వారా తీయడానికి ప్రయత్నించారంటూ అప్పట్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద కేసీఆర్ ప్రభుత్వం కేసులు కూడా పెట్టింది. చరిత్ర అలా వుంటే, వర్తమానంలో మాత్రం ఈ ఫామ్‌హౌస్‌ని కూల్చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. నెలలు... వారాలు కాదు.. కేవలం కొద్ది రోజుల్లోనే కేటీఆర్ ఫామ్‌హౌస్ నేలమట్టం అయ్యే అవకాశాలు వున్నట్టు తెలుస్తోంది. ఇదేదో కేటీఆర్ మీద రేవంత్‌రెడ్డి పగబట్టి చేస్తున్న చర్యగా భావించాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయే క్రమంలోనే కేటీఆర్ ఫామ్‌హౌస్ నేలమట్టం అవబోతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జలవనరులను ఆక్రమించి, పూడ్చేసి, జలవనరులకు ఇబ్బంది కలిగేలా నిర్మించిన పెద్దపెద్ద కట్టడాలను ‘హైడ్రా’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కూల్చేస్తోంది. రంగనాథ్ అనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌కి ‘హైడ్రా’ బాధ్యతలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పగించింది. ఆయన ముక్కసూటిగా వెళ్తూ ఇప్పటికే చాలా పెద్దపెద్ద అపార్ట్.మెంట్లని కూల్చేశారు. రాజకీయ నాయకులకు... అది కూడా అస్మదీయులైన రాజకీయ నాయకులకు సంబంధించిన కట్టడాలను కూడా ఎంతమాత్రం మొహమాటపడకుండా కూల్చేస్తున్నారు. పాతబస్తీలో ఒక కట్టడం కూల్చేస్తుంటే మజ్లిస్ ఎమ్మెల్యే వచ్చి అడ్డుపడినా కూల్చేశారు. అలాగే దానం నాగేందర్ ‘హస్తం’ వున్న కబ్జాని కూడా అడ్డుకున్నారు. ఇప్పటి వరకు హైడ్రా వందకు పైగా ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యే, మిత్రపక్షం ఎమ్మెల్యేని కూడా లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న ‘హైడ్రా’ ఆధ్వర్యంలోనే కేటీఆర్ ఫామ్‌హౌస్ త్వరలో కుప్పకూలబోతోందని సమాచారం.
http://www.teluguone.com/news/content/all-set-for-demolish-ktr-farmhouse-25-183062.html





