ముడుపులు, కమీషన్లు లేని పారదర్శక టెండర్ విధానం.. తమిళనాడు సీఎంపై ప్రశంసల వర్షం
Publish Date:Jul 2, 2026
Advertisement
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తాజాగా రాష్ట్రంలో పబ్లిక్ ఫండింగ్, ప్రజా పనుల కేటాయింపుల్లో దశాబ్దాలుగా నడుస్తున్న పాత పద్ధతులకు పూర్తిగా చరమగీతం పాడుతూ విజయ్ ప్రవేశపెట్టిన ట్రాన్స్‌పరెంట్ టెండర్ సిస్టమ్ ఇప్పుడు పాత తరం కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ఈ విధానం వల్ల భారీగా ప్రజా ధనం ఆదా అవుతుండటం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కొత్త విధానం అమలులోకి వచ్చిన వారాల వ్యవధిలోనే.. సివిల్ పనులపై ప్రభుత్వం అంచనా వేసిన వ్యయం కంటే అత్యంత తక్కువ ధరకు కాంట్రాక్టర్లు పనులను దక్కించుకుంటున్నారు. తాజాగా జరుగుతున్న ఓపెన్ కాంపిటీషన్‌లో అనేక మంది కాంట్రాక్టర్లు పనులను దక్కించుకోవడమే లక్ష్యంగా, మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ రేట్లను కోట్ చేస్తున్నారు. పలు ప్రభుత్వ ప్రాజెక్టులలో అధికారిక అంచనాల కంటే ఏకంగా 25 శాతం నుండి 30 శాతం వరకు తక్కువ ధరలకే టెండర్లు దాఖలవుతున్నాయి. ఈ స్థాయిలో నిధులు మిగలడం చూసి సాధారణ ప్రజలతో పాటు రాజకీయ పరిశీలకులు సైతం విస్మయం చెందుతున్నారు. ఈ సరికొత్త పరిణామం ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద చర్చకు తెరలేపింది. ప్రస్తుతం 25-30 శాతం తక్కువ ధరలకే నాణ్యమైన పనులు చేయడం సాధ్యమైనప్పుడు, గత ప్రభుత్వాల హయాంలో అదనంగా ఖర్చయిన ఆ కోట్లాది రూపాయల ప్రజాధనం ఎవరి జేబుల్లోకి వెళ్ళిందనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత పాలకుల అవినీతి, కమీషన్ల సంస్కృతిని ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి విజయ్ కి ఇది రాజకీయ ఆయుధంగా మారింది. గతంలో కాంట్రాక్టర్లు టెండర్ల ధరలను ఖరారు చేసేటప్పుడు అనధికారిక ఖర్చులు, కమీషన్లను కూడా లెక్కలోకి తీసుకుని ప్రభుత్వానికి భారీగా బిల్లులు వేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ సరికొత్త పారదర్శక విధానం వల్ల తాము ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, అందుకే తక్కువ ధరలకే నాణ్యమైన పనులు చేయగలుగుతున్నామని కొందరు చిన్న తరహా కాంట్రాక్టర్లు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఏదేమైనా.. ఇంత తక్కువ బడ్జెట్‌తో పనులు చేపడుతున్నప్పుడు వాటి నాణ్యత దెబ్బతినకుండా చూడటమే సీఎం విజయ్ ముందున్న అసలైన సవాలు. కాంట్రాక్టర్లు పోటీ పడి రేట్లు తగ్గించినప్పటికీ, పనుల్లో ఏమాత్రం రాజీ పడకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ సరికొత్త టెండర్ ఫార్ములా' విజయ్ ప్రభుత్వానికి ప్రజలలో మైలేజ్ తెచ్చి పెట్టింది. ప్రజాధనాన్ని కాపాడుతూ, పాత వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతున్నారంటూ విజయ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
http://www.teluguone.com/news/content/a-transparent-tender-process-free-from-kickbacks-and-commissions-25-224837.html





