జగన్ ని కలిసిన టిడిపి ఎమ్మెల్యే, సస్పెన్షన్
Publish Date:Oct 30, 2012
Advertisement
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రవీణ్ ను టిడిపి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గా ఆ పార్టీ ప్రకటించింది. కొంతకాలం క్రితం చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ప్రధానికి లేఖ రాయడాన్ని ప్రవీణ్ తప్పు పట్టారు. అప్పటి నుండి పార్టీకి దూరంగా ఉంటున్నా తాను పార్టీని వీడనని ప్రకటించారు. తాజాగా జగన్ ను కలవడంతో ఆయన పార్టీని వీడడం ఖాయమని తేలిపోయింది. చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని విమర్శించారు. తెలంగాణపై చంద్రబాబు లేఖ ఇవ్వడాన్ని తప్పు పట్టిన ప్రవీణ్ ఆయనపై నిప్పులు చెరిగారు. తెలంగాణపై బాబు ఇచ్చిన లేఖతో ఇప్పుడు ఇరు ప్రాంతాల నేతలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కానీ కొందరు బయటపడటం లేదన్నారు. బాబు లేఖతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అది అందర్నీ కన్ఫూజన్ చేసే విధంగా ఉందన్నారు. తాను అతి త్వరలో మంచి ముహూర్తం చూసుకొని జగన్ పార్టీలో చేరతానని చెప్పారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం విఫలమైందన్నారు. అధికార కాంగ్రెసు తప్పులు చేస్తే నిలదీయమని ప్రజలు టిడిపిని ప్రతిపక్షంలో కూర్చుండబెడితే చంద్రబాబు వారి నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం టిడిపి, కాంగ్రెసు ఏకమయ్యాయన్నారు. జగన్ పార్టీలోకి ఇంకా ఎంతమంది వస్తారో తనకు తెలియదన్నారు. యువత జగన్ వెంట ఉందని అన్నారు.
http://www.teluguone.com/news/content/-tdp-mla-praveen-kumar-reddy-31-18708.html