కిరణ్ కి కళ్లు తిరిగాయ్..
Publish Date:Oct 30, 2012

Advertisement
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మార్క్ మచ్చుకైనా కనిపించలేదు. అసలు ఆయన అభిప్రాయాన్ని అడగడంకానీ, కనీసం పట్టించుకోవడంగానీ కూడా అధిష్ఠానం చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. కారణం.. కిరణ్ మీద అధిష్ఠానానికి అంతగా నమ్మకం లేకపోవడమేనని సీనియర్ల ఉవాచ. ఏరికోరి కిరణ్ కి ముఖ్యమంత్రి కుర్చీ అప్పజెప్పినప్పుడు డైనమిక్ గా వ్యవహరించాలన్న , వ్యవహరిస్తారన్న నమ్మకం ఎక్కడో ఓ మూలన్నా అధిష్ఠానానికి ఉండుంటుంది. కానీ.. కిరణ్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారన్న భావన కాంగ్రెస్ అధినేత్ర దృష్టిలో బలంగా పడిపోయిందని చాలామంది నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.
కేంద్రమంత్రివర్గ విస్తరణ విషయంలో పిసిసి చీఫ్ బొత్సని, చిరంజీవిని సంప్రదించి జాబితాని రూపొందించుకున్న అధిష్ఠానం కేవలం మొక్కుబడిగానే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చెవిన వేసింది తప్ప, ఆయనకు ఎలాంటి ప్రాథాన్యతా ఇవ్వలేదుగాక ఇవ్వలేదన్న విషయం ఏపీలో కిందిస్థాయి కార్యకర్తలకు కూడా తేటతెల్లమయ్యిందంటూ కిరణ్ వ్యతిరేకవర్గాలు పండగ చేసుకుంటున్నట్టు సమాచారం. అధిష్ఠానం అండ తనకుందన్న మితిమీరిన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డికి అదనుచూసి సరైన సమయంలో సోనియా ఝలక్ ఇచ్చారంటూ పార్టీలోని కొందరు నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారటకూడా.. మొత్తానికి అన్ని రోజులూ ఒకేలా ఉండవన్న విషయం.
కిరణ్ కుమార్ రెడ్డికి ఈ పాటికే అర్ధమయ్యుంటుందేమో..
http://www.teluguone.com/news/content/-kiran-kumar-reddy-31-18703.html












