జగన్ పార్టీ రాజభవనాల నిర్మాణ రహస్యం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పార్టీ ఆఫీసులను వైసీపీ నిర్మిస్తోంది. అధికారంలో వున్న సమయంలో చాలా ఖరీదైన భూములను అప్పనంగా లీజుకు తీసుకుంది. ఆయా భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్యాలెస్‌ల రేంజ్‌లో వుండే భారీ కట్టడాలు అనుమతుల్లాంటివేవీ లేకుండా నిర్మిస్తోంది. ఈ కట్టాడాల్లో కొన్ని నిర్మాణం పూర్తయితే, కొన్ని నిర్మాణ దశలో వున్నాయి. కొన్ని నిర్మాణం ప్రారంభమయ్యే దశలో వున్నాయి. అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న ఒక నిర్మాణాన్ని మాత్రం ప్రభుత్వం కూల్చేసింది. మిగతా అక్రమ కట్టడాలన్నిటికీ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు సంతృప్తికరమైన వివరణ లభించని పక్షంలో ప్రభుత్వం ఏంచేస్తుందో చూడాలి. ఈ నేపథ్యంలో మా కట్టడాలు కూల్చొద్దంటూ వైసీపీ కోర్టును ఆశ్రయించింది. ఇవీ జగన్ పార్టీ ఆఫీసుల ఇష్యూలో ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయాలు. అయితే ఈ పార్టీ ఆఫీసుల విషయంలో ఇంకా చాలా రహస్యాలు వున్నాయి. ముఖ్యంగా ఇంతింత రాజభవనాల నిర్మాణం వెనుక వున్న రహస్యాలు తెలుసుకుందాం.

ఏపీలోని ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో మాంఛి బిజీ ఏరియాలో చాలా విలువైన గవర్నమెంట్ భూమి ఎక్కడుందో జిల్లాకు సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యేలు సెర్చ్ చేసి కనుక్కోవాలి. ఫలానా చోట భూమి వుంది. దాన్ని మన పార్టీ ఆఫీసుకి నొక్కేసుకోవచ్చు అని వాళ్ళు జగన్‌కి సమాచారం అందిస్తారు. అప్పుడు జగన్ రాజధాని లెవల్లో చక్రం తిప్పి, ఆ ప్రభుత్వ భూమి నేపథ్యం ఏదైనా, అన్నిటినీ పక్కకి నెట్టేసి, అభ్యంతరం చెప్పిన వారిని అణిచేసి సదరు భూమిని పార్టీకి అధికారికంగా కేటాయించేసుకుని, తానే అనుమతులు ఇచ్చేసుకుంటారు. మొత్తం 26 జిల్లాలో భూమిని కేటాయించడం వరకే జగనన్న పని ఆ తర్వాత జగనన్నకి ఎంతమాత్రం సంబంధం లేదు. పార్టీ ఆఫీసు నిర్మించడానికి పార్టీ అకౌంట్ నుంచి సింగిల్ రూపీ కూడా ఇవ్వరు.

మరి జగనన్న సింగిల్ రూపీ కూడా ఇవ్వకుండా అంతంత ఇంద్రభవనాలు ఎలా నిర్మించారు? ఇక్కడే జగనన్న మార్కు ‘క్విడ్‌ప్రోకో’ స్కీమ్ అమల్లోకి వస్తుంది. ‘నేను మీకు ఈ ప్రయోజనం చేకూరుస్తా.. నువ్వు నాకు ఈ ప్రయోజనం చేకూర్చు’ స్కీము కింద రాష్ట్రంలో వైసీపీ భవనాల నిర్మాణం జరిగింది. స్థానికంగా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందినవారు, తాయిలాలు అందుకున్న వారు... వాళ్ళు తిరిగి చెల్లించాల్సిన తృణమో, పణమో డబ్బు, బిల్డింగ్ మెటీరియల్... ఇతరత్రా ఖర్చు రూపంలో చెల్లిస్తూ వుంటారు. అలాగే కొంతమంది మీద సామ, దాన, బేద, దండోపాయాలను ఉపయోగించి భవన నిర్మాణానికి అవసరమైన డబ్బును సేకరిస్తారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యేల నాయకత్వంలో జరుగుతుంది. ఈ విధంగా పార్టీకి పైసా ఖర్చు లేకుండా ఇంద్రభవనాల నిర్మాణం పూర్తవుతుంది. ఇదీ ఈ రాజభవనాల వెనుక వున్న రహస్యం.