వైకాపా అభ్యర్ధికి ఓటేస్తే పార్టీలో ఉంటారో జంప్ చేస్తారో?

 

వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా అభ్యర్ధిగా నల్లా సూర్యప్రకాష్ పోటీ చేస్తున్నారు. ఆయన తరపున ప్రచారం చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే రోజా, “రాజన్న రాజ్యం కావాలంటే వైకాపా అభ్యర్ధికే ఓటు వేసి గెలిపించాలని” ప్రజలను కోరుతున్నారు. ఆ ఒక్కడి వలన రాజన్న రాజ్యం ఎలా సాధ్యమో తెలియదు కానీ ఏదో ఒకరోజు ఆయన కూడా తెరాస పార్టీలోకి జంప్ చేసేయడం మాత్రం ఖాయమని కాంగ్రెస్, తెదేపా, బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఇంతకాలం ప్రజా సమస్యలపై నోరు విప్పి మాట్లాడటానికి కూడా ఇష్టపడని వైకాపా నేతలు, ఇప్పుడు తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించడం చాలా ఆశ్చర్యంగా ఉంది.

 

అప్పుడెప్పుడో రాజశేఖ రెడ్డి అమలుచేసిన పధకాలే తప్ప తెరాస ప్రభుత్వం కొత్తగా అమలుచేసినవి ఒక్కటి కూడా లేవని రోజా విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పాలించిన ముఖ్యమంత్రులలో రాజశేఖర్ రెడ్డి ఒక్కరే చాలా ప్రజారంజకమయిన పరిపాలన చేసారని రోజా అన్నారు. కేసీఆర్ కి మాయమాటలు చెపుతూ ప్రజలను మభ్య పెట్టడం తప్ప అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలుచేయడం చేతకాదని రోజా విమర్శించారు. ఆంద్రాలో చంద్రబాబు, తెలంగాణాలో చంద్రశేఖర్ రావు ఇద్దరూ కూడా ప్రజలను మభ్య పెట్టడంలో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరని రోజా ఎద్దేవా చేసారు. ఇంతవరకు తెలంగాణాలో వైకాపా నేతలు ఎన్నడూ కూడా రైతుల ఆత్మహత్యలు గురించి నోరు విప్పి మాట్లాడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకు మాట్లాడలేదో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రోజా తెలంగాణాలో 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే తెరాస ప్రభుత్వం పట్టించుకాలేదని విమర్శించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. రోజా ప్రచారం చూస్తుంటే తెరాస-వైకాపాలు రెండు బద్ధ శత్రువులన్నట్లుగా ఉంది. కానీ ఈ ఎన్నికలలో గెలిచే అవకాశం ఏ మాత్రం లేదని తెలిసున్నప్పటికీ వైకాపా పోటీ చేస్తుండటం గమనిస్తే అది కేవలం ఓట్లు చీల్చి ఇప్పుడు తను విమర్శిస్తున్న తెరాసకు లబ్ది చేకూర్చడానికే తప్ప మరో ప్రయోజనం కనబడటం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu