కాంగ్రెస్ పార్టీకి ఎం.ఎస్.దెబ్బ

 

నోరు విప్పి మాట్లాడితే ఏదో ఒక వివాదం రేకెత్తించే నేతలలో మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్.సత్యనారాయణరావు కూడా ఒకరు. ఆయన మీడియాలో కనిపించి చాలా కాలమే అయ్యింది. కానీ లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తానన్నట్లు, మీడియా ముందుకు వచ్చి రావడంతోనే కాంగ్రెస్ పార్టీలో బాంబులు పేల్చి అందరినీ హడాలెత్తించారు. సరిగ్గా వరంగల్ ఉప ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అభ్యర్ధి రాజయ్య జైలు పాలవడంతో ఆయనకి బదులు సర్వే సత్యనారాయణని నిలబెట్టి ఆయనని గెలిపించుకొనేందుకు కాంగ్రెస్ నేతలందరూ చాలా ఆపసోపాలు పడుతుంటే, అకస్మాత్తుగా ఊడిపడిన ఎమ్.సత్యనారాయణరావు తెరాస ప్రభుత్వం దాని ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరును తెగ మెచ్చుకొన్నారు.

 

తెరాస ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా అయన తెగ మెచ్చుకొని తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ బాగానే కృషి చేస్తున్నారని మెచ్చుకొన్నారు. కానీ కొంచెం దూకుడు తగ్గించుకొని ప్రతిపక్షాలని కూడా తనతో కలుపుకుపోవాలని సూచించారు. అలాగే ప్రతిపక్షాలు కూడా తెరాస ప్రభుత్వాన్ని ఏదో విమర్శించాలి గాబట్టి విమర్శిస్తున్నాయి తప్ప నిజంగా విమర్శించవలసినంత తప్పులు ఏమీ కనబడటం లేదని అభిప్రాయం వ్యక్తం చేసారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి నిర్మాణాత్మకమయిన సలహాలు ఇవ్వాలి తప్ప ఊరికే ప్రతీ దానికి ప్రభుత్వాన్ని విమర్శించకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. వరంగల్ ఉప ఎన్నికలలో ఎవరికీ ఓట్లు వేయాలో ప్రజలకి తెలుసని, బహుశః బిహార్ ఎన్నికల ఫలితాలు మళ్ళీ ఇక్కడ కూడా పునరావృతం అవుతాయని అభిప్రాయ పడ్డారు.

 

సరిగా వరంగల్ ఉప ఎన్నికలు జరిగే ముందు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత నుండి ఆటువంటి కితాబు అందుకోవడం తెరాసకు ఒక వరమనే చెప్పవచ్చును. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తమపై చేస్తున్న విమర్శలకు జవాబుగా తెరాస నేతలు సత్యనారాయణ తమ ప్రభుత్వం గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలనే పేర్కొనడం తధ్యం. తెరాస నేతలు వరంగల్ ప్రజలకు నచ్చజెప్పడానికి కూడా సత్యనారాయణ చెప్పిన మాటలను ఉపయోగించుకోవచ్చును.

 

కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తప్పు పడుతుంటే కాంగ్రెస్ పార్టీకే చెందిన సత్యనారాయణ తెరాస ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఈవిధంగా వెనకేసుకొని రావడంతో వారు చాలా ఇబ్బంది పడుతున్నారు.  బిహార్ ఎన్నికలలో అధికార కూటమి విజయం సాధించింది కనుక వరంగల్ ఎన్నికలలో కూడా అధికార తెరాస గెలుస్తుందని ఆయన జోస్యం చెపుతున్నారేమోనని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.ఈ ఉప ఎన్నికలలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని బల్లగుద్ది చెప్పిన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజయ్య ఇంట్లో జరిగిన దుర్ఘటనప్పటి నుండి నేటి వరకు వరుసగా జరుగుతున్న ఈ పరిణామలన్నిటినీ చూసి ఇప్పుడు అదే మాట గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో సత్యనారాయణ వచ్చి తన మాటలతో కాంగ్రెస్ విజయావకాశాలను మరింత దెబ్బ తీశారని  కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu