వైసీపీ వారికి అప్పనంగా వైకుంఠ ద్వార దర్శనాలు!?
posted on Dec 30, 2025 10:22AM

వడ్డించేవాడు మనవాడైతే భోజనానికి చివరి పంక్తిలో కూర్చున్నా ఫరవాలేదన్నది సామెత. అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో ఆ సామెతను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు, కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు. ఇప్పుడు ఆ సామెతను వడ్డించేవాడు మనవాడే ఉన్న మొదటి మొదటి పంక్తిలో కూర్చున్నా లాభం లేని పరిస్థితి ఏర్పడిందని మార్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు. ఔను తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాల విషయంలో వైసీపీయులదే హవా అంటున్నారు. వైసీపీ లీడర్లకు ఉత్తర ద్వార దర్శనాలను తిరుమల అడిషనల్ ఈవో దగ్గరుండి మరీ చేయిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేస్తున్నారు.
తెలుగుదేశం కూటమి సర్కార్ లో కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వారికి దక్కని వైకుంఠ ద్వార దర్శనాలు వైసీపీ నేతలకు మాత్రం అధికారులు దగ్గరుండి మరీ తీసుకువెళ్లి దర్శనం చేయించ డమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నుంచి వచ్చినదేవినేని అవినాష్, మల్లాది విష్ణుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు మంగళవారం (డిసెంబర్ 30)న తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సరే పెద్దిరెడ్డి అంటే లోకల్. మరి మల్లాది, దేవినేని సైతం వైకుంఠ ద్వారా దర్శనాలు అలవోకగా ఎలా చేసుకోగలిగారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా వైసీపీ వారి మాటే ఇంకా తిరుమలలో చెల్లుబాటు అవుతోందనడానికి ఇంత కంటే నిరద్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారు.. అధికారం కోల్పోయినా వైసీపీ వారి పనులు యథేచ్ఛగా నడుస్తున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేననడానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైసీపీయులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దగ్గరుండి మరీ ఉత్తరద్వార దర్శనాలను కల్పించడమే నిదర్శనమని అంటున్నారు.