బీజేపీకి బెంగాల్ బెంగ
posted on Nov 13, 2015 9:58AM

బీహార్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పరిస్థితి చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడేలా వుంది. ప్రస్తుతం బీజేపీలో బీహార్ పరాజయానికి ఎవరిని బాధ్యులను చేయాలా అన్న చర్చ భారీ స్థాయిలో జరుగుతోంది. మోడీనే పూర్తి బాధ్యుడిని చేయాలని ఒక వర్గం ప్రయత్నిస్తుంటే, ఇది మోడీ వైఫల్యం కాదని... ఈ పరాజయాన్ని సమష్టి బాధ్యతగా తీసుకోవాలని మరో వర్గం అంటోంది. ఈ అంతర్గత పోరు విషయం ఇలా వుంటే ఇప్పుడు బీజేపీకి బెంగాల్ బెంగ వచ్చి పడింది. బీహార్, బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు వరుసగా ఎన్నికలు జరుగుతాయి. బీహార్ పోరు ముగిసింది. ఫలితం తేలి బీజేపీ నెత్తిన బొప్పి కట్టింది. బీహార్లో విజయం సాధిస్తే బెంగాల్ ఎన్నికలలో బీజేపీ తీరు ఒకలా వుండేది. బీహార్లో ఓడిపోవడంతో ఇప్పుడు బెంగాల్లో ఆ పార్టీ తీరు మరోలా వుండబోతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు బీజేపీకి బెంగాల్ బెంగ పట్టుకుందని చెబుతున్నారు. ప్రచారం విషయంలో బీహార్‌లో వ్యవహరించిన తీరుకు పూర్తి విరుద్ధంగా బెంగాల్‌లో వ్యవహరించాల్సి వుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈనెల 30న కోల్‌కతాలో ఒక ర్యాలీ నిర్వహించాల్సి వుంది. బీహార్ ఎన్నికల్లో పరాజయానికి ముందు ఏర్పాటు చేసిన ర్యాలీ ఇది. అయితే బీహార్ ఓటమి తర్వాత ప్రచార వ్యూహంలో వచ్చిన మార్పు నేపథ్యంలో అమిత్ షా ర్యాలీని బీజేపీ వర్గాలు రద్దుచేశాయి. ప్రచార వ్యూహంలో మార్పే ఈ ర్యాలీ రద్దుకు కారణాలన్నది బహిరంగ రహస్యమైనప్పటికీ స్థానిక బీజేపీ వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదు... డిసెంబర్లో ఆరేడు పెద్ద స్థాయి ర్యాలీలు నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. అందువల్ల ఆ ర్యాలీలకు ముందుగా మరో ర్యాలీ ఎందుకులే అని రద్దు చేశామని బెంగాల్ అంటున్నాయి. మొత్తానికి బెంగాల్ ఎన్నికలలో బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ వ్యూహాలేంటో త్వరలో అందరం చూస్తాం.