పరామర్శ యాత్రకు ముహూర్తం ఖరారు

 

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణవార్త విని తట్టుకోలేక తెలంగాణాలో గుండెపగిలి చనిపోయిన వారిని ఓదార్చేందుకు ముహూర్తం, ఓదార్చవలసిన 16 కుటుంబాలను పేర్లను వైకాపా ఖరారుచేసింది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ‘బయటే’ ఉన్నప్పటికీ, ఆయన ఆంద్ర వ్యవహారాలతో  క్షణం తీరిక లేకుండా ఉంటుండటంతో ఆ బాధ్యతను షర్మిలమ్మకు అప్పగించారు. అందువల్ల ఆమె తన అన్నగారి తరపున వారిని ఓదార్చేందుకు మళ్ళీ కొంగు బిగించక తప్పలేదు. ఆరేళ్ళయినా...అరవైఏళ్లయినా...మాటంటే మాటే... అందుకే అన్న ఇచ్చిన మాటకు కట్టుబడి షర్మిలమ్మ డిశంబర్ 8నుండి ఓదార్పు యాత్రకి బయలుదేరుతున్నారు.

 

ఆమె మొదట మెహబూబ్ నగర్ జిల్లాలో షాద్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్, కొడంగల్, వనపర్తి, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఐదు రోజుల పాటు పర్యటించి అక్కడ ఆరేళ్ళ క్రితం గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చుతారు. ఆ తరువాత మిగిలిన జిల్లాలలో రాజశేఖర్ రెడ్డి కోసం చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారని ఆ పార్టీ తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అయితే ఈ యాత్రకు 'ఆంద్రాయాత్ర'లకు పెట్టిన పేరే పెట్టి తెలంగాణా ప్రజల మనసు కష్టపెట్టడం ఇష్టం లేక, ఆమె ఓదార్పుయాత్రకు ‘పరామర్శయాత్ర’ అని పేరు పెట్టారు.

 

అయితే  గిట్టనివారు ఇదంతా చూసి, ఎప్పుడో చనిపోయినవారి కుటుంబాలను ఆరేళ్ళ తరువాత తాపీగా వచ్చి ఇప్పుడు ఓదార్చడం ఏమిటి వెటకారం కాకపోతేనూ...అయినా తెలంగాణాలో జెండా పీకేసి పార్టీ కార్యాలయాలను ఖాళీ చేసేసి వెళ్ళిపోయిన వైకాపా, మళ్ళీ ఇప్పుడు అక్కడ జెండా పాతి, పార్టీ నడిపించుకోదలిస్తే దానికి ఈ డ్రామాలన్నీ ఎందుకు? ఆ పనేదో నేరుగా చేస్తేనే సరిపోతుంది కదా...అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ షర్మిలమ్మ కేవలం చనిపోయిన వారి కుటుంబాలకు ‘మనోధైర్యం’ ఇచ్చేందుకే వారిని పరామర్శిస్తున్నారు తప్ప మీరనుకొన్నట్లు జెండా పాతడానికీ కాదు..పార్టీని బలపరుచుకోవడానికీ కాదు...అది గిట్టని వారు చేసే ప్రచారం మాత్రమేనని వైకాపా సర్దిచెప్పుకోవలసిరావడం చాలా బాధాకరమయిన విషయమే.