ఆ ధర్నాలు ప్రజా సమస్యల కోసమా, ఎన్నికల కోసమా?

 

ఇటీవల హూద్ హూద్ తుఫాను సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వైజాగులో వారం రోజులు మకాం వేసి సహాయ, పునరావాస చర్యలు పర్యవేక్షించడంతో స్థానిక ప్రజలు ఆయనను చాలా మెచ్చుకొన్నారు. కేవలం వారం పదిరోజుల్లోనే తుఫాను దెబ్బకు ఘోరంగా దెబ్బ తిన్న వైజాగ్ నగరాన్ని మళ్ళీ గాడినపెట్టిన తరువాత కానీ ఆయన కదలలేదు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందంటూ ధర్నాలు చేసారు, కానీ దానికి బొత్తిగా ప్రజల నుండి స్పందన కరువయింది. అంతే కాదు ప్రధాని మోడీ ప్రకటించిన రూ. వెయ్యి కోట్లు తీసుకు రావడంలోను రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందంటూ, ఆయన ఆ వంకతో డిల్లీ వెళ్లి కేంద్ర ఆర్ధిక, హోంశాఖ మంత్రులను కలిసి రావడం కూడా విమర్శలకు తావిచ్చింది.

 

గతంలో వివిధ కారణాల వలన వాయిదా పడిన విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ (జి.వి.యం.సి.) ఎన్నికలను త్వరలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పసిగట్టగానే ఆయన కన్ను మళ్ళీ విశాఖ మీద పడింది. గతంలో అక్కడి నుండి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను పోటీకి నిలబెట్టవద్దని కొణతాల వంటి పార్టీ విధేయులు ఎంతగా వారిస్తున్నా వినకుండా పోటీకి నిలబెట్టి ఆమె ఓటమికి కారణమయిన జగన్మోహన్ రెడ్డి, ఈసారి జి.వి.యం.సి. ఎలాగయినా గెలిచి వైజాగ్ పై పట్టు సాధించాలని భావిస్తున్నారు. కానీ కొణతాల, దాడి వీరభద్ర రావు, గండి బాబ్జి, వంటి కొందరు నేతలు వారి అనుచరులు ఇప్పటికీ పార్టీని వీడి వెళ్లిపోగా మరో నలుగురు యం.యల్యే.లు వారి అనుచరులు కూడా త్వరలో పార్టీని వీడి వెళ్లిపోయేందుకు సిద్దంగా ఉన్నారని తెలిసి జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఎన్నికలు ముంచుకు వస్తున్న ఈ కీలకమయిన సమయంలో పార్టీని వీడి ఎవరూ బయటకువెళ్లిపోకుండా నిలిపి ఉంచేందుకు ఈనెల 21న అంటే రేపు జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలతో విస్త్రుత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. విశాఖలో తన ఉనికిని చాటు కొనేందుకు, రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల హామీలను వెంటనే అమలుచేయాలని కోరుతూ వచ్చేనెల 5న జగన్ స్వయంగా మహాధర్నా నిర్వహించబోతున్నారు.

 

పోగొట్టుకొన్న చోటే ఉంగరం వెతుక్కోవాలనే ఆయన ఆలోచన సరయినదే. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ధర్నాలు చేస్తూ అవి ప్రజా సమస్యలపై పోరాటాలని కలరింగ్ ఇస్తే అది ‘అవిశ్వసనీయత’ అవుతుంది. తుఫాను సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన చొరవను, నిర్వహించిన సహాయ చర్యలను మెచ్చుకొంటున్న ప్రజల ముందు ఆయనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ ధర్నాలు చేయడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందేమో?