తన ఎమ్మెల్యేలపై జగన్ "విహారాస్త్రం"...!
posted on May 30, 2016 12:17PM

పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరు..ఏ క్షణాన సైకిలెక్కుతారో తెలియక బుర్ర హీటెక్కిపోతోన్న టైంలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో వైసీపీ అధినేత జగన్‌కు టెన్షన్ ఎక్కువైపోయింది. ఏపీ నుంచి భర్తీ కానున్న 4 సీట్లలో మూడు టీడీపీకి, ఒకటి వైసీపీకి దక్కనున్నాయి. అయితే వైసీపీకి ఒక్కటి కూడా దక్కకుండా చేయడానికి టీడీపీ పావులు కదుపుతోంది. వైసీపీ నుంచి ఇప్పటికే 17 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఆకర్షించిన టీడీపీ మరో 15 మంది శాసనసభ్యులకు వలవేసింది. రాజ్యసభ ఎన్నికల నాటికి పని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వీటిని తిప్పికొట్టడానికి వైసీపీ అధినాయకత్వం వ్యూహం రచించింది.
వైసీపీ సీనియర్లు కొందరు పార్టీ శాసనసభ్యులను విహారయాత్రకు తరలిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అధినేత ముందు ఉంచారు. ఒకే చోట అందరినీ తరలించే క్యాంపు రాజకీయాలు వద్దని ఇది పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని జగన్ తొలుత వారించినప్పటికి, తెలుగుదేశం ఎటాక్ నుంచి రక్షించుకోవాలంటే వేరే దారి లేదని ఒప్పుకోక తప్పలేదు. ఈ నేపథ్యంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను దేశంలోని కేరళ, గోవా, బెంగుళూరు వంటి పర్యాటక ప్రాంతాలకు పంపినట్టు సమాచారం. ఎమ్మెల్యేలతో పాటుగా వారి కుటుంబసభ్యులను కూడా ఈ విహారయాత్రలకు పంపినట్టు లోటస్‌పాండ్ టాక్. వీరంతా రాజ్యసభ ఎన్నికలకు ఒకరోజు ముందు హైదరాబాద్‌కు వచ్చేలా షెడ్యూల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. క్యాంపు రాజకీయం అనుకున్నా.. మరోకటి అనుకున్నా టీడీపీ బారి నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇంతకు మించిన దారి జగన్‌కు కనిపించలేదని అర్థమవుతోంది. ఎంత దాచి ఉంచినా ఎమ్మెల్యేలు గోడ దూకకుండా ఉంటారా.?