ఛీ..ఈ జాబేందుకు చేస్తున్నాన్రా బాబూ..!
posted on May 30, 2016 2:40PM

దేశంలో యువత ఆలోచిస్తున్న తీరిది. ఒకవైపు ఉద్యోగాల కోసం కోట్లాది మంది కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే..బహుళ జాతి సంస్థల్లో పనిచేస్తూ..ఐదెంకెల జీతం తీసుకుంటూ అసంతృప్తితో పనిచేస్తున్న వారు దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్నారు. టైమ్స్ జాబ్స్ నిర్వహించిన సర్వే ప్రకారం భారత్‌లో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 60 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలంటేనే అసహ్యించుకుంటున్నారు. ఇది ఏ ఒక్క రంగానికో పరిమితం కాదు ఉద్యోగ భద్రత ఉండే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, భీమా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులతో పాటు భారీ జీతాలు, వారాంతంలో రెండు రోజులు సెలవులుండే ఐటీ, టెలికాం రంగంలోనూ నూటికి 50 శాతం మంది ఉద్యోగులు ఇదెక్కడి ఖర్మరా బాబూ అంటూ నెత్తి బాదుకుంటున్నారు.
అసలు ఉద్యోగుల్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న 50 శాతం మంది తమ "బాస్ టార్చర్" భరించలేకపోతున్నామని/సహోద్యోగులతో వేగలేకపోతున్నామనో చెప్పారు. 30 శాతం మంది మాత్రం కంపెనీలో తమ పాత్ర లేదా పొజిషన్ బాగా లేనందున ఉద్యోగంపై మనసు వెళ్లడంలేదన్నారు. మరి కొంతమంది ఆఫీసులో పని వాతావరణం, షెడ్యూల్స్ బాగోలేదని చెప్పారు. ఎన్నేళ్లు పనిచేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు జీవితంలో ఎలాంటి మార్పు రాకపోవడం కూడా ఉద్యోగంపై విసుగురావడానికి కారణంగా తెలిపారు. అయినా తాము నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం మనసు చంపుకుని పనిచేసేవారు భారత్‌లో అడుగడుగునా కనిపిస్తారు. కాని ఇటువంటి పరిస్థితి వల్ల ధీర్ఘకాలంలో ఒత్తిడి ఎక్కువై మనిషి డిప్రెషన్‌కు గురవుతాడని మానసిక నిపుణులు అంటున్నారు. ఈ సందర్భంలో ప్రఖ్యాత వ్యాపారవేత్త, ప్రపంచ మేధావి స్టీవ్ జాబ్స్ మాటలు గుర్తుకురాక మానవు. "ఏ పనైతే నీకు గొప్పగా అనిపిస్తుందో అదే నీ వృత్తి, నీ ఉద్యోగం కావాలి. ఆ రంగాన్నే ఎంచుకోండి..ప్రేమించే పనిలోనే అద్భుతాలు చేయగలం..ప్రేమలేని కొలువులు మహా అయితే జీతాన్నిస్తాయి, జీవితాన్ని ఇవ్వవు" అంటూ ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యాలు.