రాజన్‌ను వదలనంటున్న స్వామి..!
posted on May 30, 2016 11:35AM

ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టే బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్యస్వామి ఈ సారి రాజకీయ పార్టీలను కాదని ప్రభుత్వ సంస్థ అధినేతను టార్గెట్ చేశారు. ఆ అధినేత ఎవరో కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్. రాజన్ పదవికాలం పొడిగింపుపై ప్రధానికి లేఖ రాసిన స్వామి ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజన్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ఆయన వల్లే దేశ ఆర్థికవ్యవస్థ నష్టాల బాట పట్టిందని విమర్శించారు. అమెరికా పౌరసత్వం ఉన్న రాజన్ ఆ దేశానికి అనుకూలంగా పనిచేస్తున్నాడని అందుకే అమెరికా సైతం గ్రీన్ కార్డ్‌ను పొడిగించిందని ఆరోపించారు. రాజన్ వల్ల దేశానికి కీడే ఎక్కువ జరిగిందని..పరిశ్రమలు మూతపడ్డాయని, నిరుద్యోగం పెరిగిందని.వెంటనే ఆయన్ను పదవి నుంచి తప్పించకపోతే మరింత ప్రమాదకరమన్నారు.
ఆయన వ్యాఖ్యలు ఇటు ప్రభుత్వంలోనూ..అటు ఆర్ధిక రంగంలోనూ తీవ్ర దుమారం రేపాయి. దీంతో కాస్త సైలెంట్ అయిన స్వామి నిన్న మరోసారి బాంబు పేల్చారు. రాజన్ ఇండియాకు సంబంధించిన ఎంతో రహస్య సమాచారాన్ని, సున్నితాంశాలను బయటకు పంపుతున్నారని ఆరోపించారు. తక్షణం పదవి నుంచి తీసేయాలని ప్రధానికి రెండవసారి లేఖ రాశారు. ఓ ప్రభుత్వ అధికారి అయ్యుండి కేంద్రానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అసహనం, జాతి వ్యతిరేక కార్యాకలాపాలపై రాజన్ వ్యాఖ్యలను ఇందుకు ఉదహరణగా ప్రస్తావించారు. ఏది ఎమైనా..ఎంతమంది ఆయనకు సపోర్ట్ చేసినా సరే తాను మాత్రం రాజన్ వదిలేది లేదన్నట్టుగా స్వామి ప్రవర్తన ఆశ్చర్యానికి గురిచేస్తోంది.