వరంగల్: ఒక దెబ్బ... రెండు పిట్టలు


రాజకీయ నాయకులు రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, అధికారంలోకి రావడానికి రకరకాల ప్లాన్స్ వేస్తూ వుంటారు. వాటిలో కొన్ని సక్సెస్ అవుతూ వుంటాయి. కొన్ని ఫెయిలవుతూ వుంటాయి. అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ వున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తండ్రిచాటు బిడ్డగా వున్నంతవరకూ ఓకే... ఆ తర్వాతే రాజకీయంగా ఏ ప్లాన్ వేసినా సక్సెస్ కావడం లేదు. ఎన్ని ప్లాన్లు సక్సెస్ కాకపోయినా మొక్కవోని దీక్షతో ప్లాన్లమీద ప్లాన్లు వేస్తూ ముందుకు వెళ్తున్న ఆయన మనోనిబ్బరానికి హేట్సాఫ్ చెప్పాలి. గత కొంతకాలంగా టీఆర్ఎస్‌కి బాహాటంగా మద్దతు ఇవ్వడం ద్వారా వైసీపీ ఏపీలో ప్రజల ఆగ్రహానికి గురైంది. టీఆర్ఎస్‌కి బాహాటంగా మద్దతు ఇవ్వడం అంటే ఏపీలో కొరివితో తల గోక్కున్నట్టే అని అర్థమైన జగన్ సార్ నష్ట నివారణకు సరైన అవకాశం కోసం ఎదురుచూశారు. ఆయనకు దొరికిన మంచి అవకాశం వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక. అటు టిఆర్ఎస్‌కి హెల్ప్ చేయడంతోపాటు ఇటు ఏపీలో తాను టీఆర్ఎస్‌కి వ్యతిరేకమని ప్రచారం చేసుకోవడానికి వీలుగా ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాంటి అవకాశమిది.

వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్‌ని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీతోపాటు టీడీపీ - బీజేపీ కూటమి కూడా చాలా పట్టుదలతో కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌లో ప్రతిపక్షాలకు పడే ఓట్లను చీల్చడానికి మరో పార్టీ సహాయం అవసరం. అందుకే కేసీఆర్ - జగన్ మధ్య జరిగిన లోపాయికారీ ఒప్పందం ఫలితంగానే వైసీపీ వరంగల్‌లో పోటీకి దిగిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇలా పోటీ చేయడం ద్వారా టీఆర్ఎస్‌ విజయానికి తనవంతు సహకారం అందించడంతోపాటు... చూశారా.. మా పార్టీ టీఆర్ఎస్ మిత్రపార్టీ కాదు... మొన్న వరంగల్ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా పోటీ చేశాం... అని ఏపీలో చెప్పుకోవడానికి వీలు కలుగుతుందనేది వైసీపీ ప్లాన్ అని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి భలే ప్లాను.. ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా... వికటిస్తుందా అనేది కాలమే తేల్చుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu