‘సీమ’ ఉద్యమంపై కోస్తా సీరియస్



ఏపీలో అధికారం సాధించలేక, తెలంగాణలో అడ్రస్ లేక కునారిల్లుతున్న వైసీపీ సంధించిన కొత్త అస్త్రం ప్రత్యేక రాయలసీమ. అది కూడా సొంత బ్యానర్‌ మీద ఉద్యమం చేసే ధైర్యం లేక మైసూరారెడ్డిని ముందుకు నెట్టి ప్రారంభించిన ఉద్యమం ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాయలసీమ సాధన సమితి పేరుతో ఉద్యమం ప్రారంభించబోతున్నానని, రాయలసీమలోని రాజకీయ శక్తులన్నిటినీ ఏకం చేయబోతున్నానని మైసూరారెడ్డి  ప్రకటించిన తర్వాత వివిధ పార్టీల్లో వున్న కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఆయన వెంట నడవటానికి సిద్ధమయ్యారు. కానీ ఆ తర్వాత మైసూరా ఈ ఉద్యమం గురించి చప్పుడు చేయడం లేదు. అయితే కొంతమంది రాజకీయ పరిశీలకులు మాత్రం తనకు ఉద్యమం చేసే శక్తి లేదని అర్థం చేసుకున్న మైసూరా  చల్లబడ్డారని అంటున్నారు. ఆయన చల్లబడ్డా, ఎలావున్నా, రాయలసీమ ఉద్యమం పేరుతో రాయలసీమ జిల్లాల లిస్టులో ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కూడా చేర్చడం పట్ల ఆ జిల్లాలలోని ప్రజలు చాలా సీరియస్‌గా వున్నారు.

ప్రస్తుతం వున్న రాయలసీమ జిల్లాలతోపాటు కోస్తాలో వున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కూడా కలిపి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ తలపెట్టిన ఉద్యమానికి రాయలసీమలో ఆదరణ  లభించడం లేదు. అదలా వుంచితే, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. రాష్ట్ర విభజన కారణంగా హృదయాలు గాయపడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మరోసారి కల్లోలంలోకి నెట్టే ప్రయత్నాలను సహించబోమని ప్రజలు అంటున్నారు. రాయలసీమకు ఎంతో ప్రాధాన్యం లభిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి రాజకీయ ఉద్యమాలు చేసి ప్రశాంత వాతావరణాన్ని భంగం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు ప్రజలయితే మరింత ఆగ్రహంగా వున్నారు. తమ రెండు జిల్లాలను కూడా రాయలసీమలో కలపాలని అనడం వెనుక ఉన్నది సముద్ర తీరాన్ని కూడా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే తప్ప మరోటి కాదని అంటున్నారు. అసలు తమ రెండు జిల్లాలను రాయలసీమలో కలపాలన్న ఆలోచనే అపరిపక్వంగా వుందని వారు విమర్శిస్తున్నారు. ఇలాంటి ఉద్యమాలు చేసుకుంటే చేసుకోండి... ఊరుకుంటే ఊరుకోండిగానీ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా విభజన చిచ్చు పెడితే సహించబోమని హెచ్చరిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu