కాంగ్రెస్ మెడ మీద గుదిబండలు



పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలదొక్కుకుని తలెత్తి చూడాలంటే ఎన్నెన్నో సమస్యలు. తల ఎత్తనివ్వకుండా మెడమీద ఎన్నో గుదిబండలు. వంద సంవత్సరాలకు పైగా వున్న చరిత్ర వున్న కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలకు పైగా చరిత్ర వున్న నాయకులు ఎందరో వున్నారు. తలలు పడిపోయిన నాయకులు మాత్రమే కాదు... నడవటానికి కూడా వీలు లేని వృద్ధ నాయకులు ఎంతోమంది వున్నారు. వాళ్ళు ఏ సమయంలో ఎలాగైనా మాట్లాడగలరు. తమ వ్యాఖ్యలతో ప్రజలను మాత్రమే కాదు.. పార్టీని కూడా ఇబ్బంది పెట్టగలరు.  కానీ ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ లైట్‌గా తీసుకుంటుంది... అదే కాంగ్రెస్ పార్టీలో వున్న విచిత్రమైన పరిస్థితి. కాంగ్రెస్ నాయకులు మాత్రం దీనిని అంతర్గత ప్రజాస్వామ్యం అనుకుంటూ వుంటారు. అలా అంతర్గత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వున్న వేలాది మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులలో అందరూ ఎమ్మెస్ అని పిలుచుకునే ఎం.సత్యనారాయణ కూడా ఒకరు. చాలాకాలంగా రెస్టు తీసుకుంటున్న ఆయన ఇప్పుడు మళ్ళీ బయటకి వచ్చి చేసిన కామెంట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ తీసేలా మారాయి.

వరంగల్ ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా విజయం సాధించాలని తంటాలు పడుతోంది. పార్లమెంటు తలుపులు మూసీ, ఎంపీలను చావబాది మరీ తెలంగాణ ఇచ్చినప్పటికీ తమకు తెలంగాణలో అధికారం రాలేదన్న బాధలో టీ కాంగ్రెస్ వుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వున్న వ్యతిరేకతను ప్రజలకు భూతద్దంలో చూపించి వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలలో విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతోంది. అసలే బలమైన అభ్యర్థి అనుకున్న రాజయ్య కుటుంబ సమస్యల కారణంగా జైల్లో పడ్డాడు. ఆయన స్థానంలో సర్వే సత్యనారాయణను పట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పాలన బాగుందని అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెస్ చేసిన వ్యాఖ్యలు టీ కాంగ్రెస్ నాయకుల నెత్తిన పిడుగులా మారాయి. ఓవైపు తామంతా టీఆర్ఎస్‌ని ఎండగడుతూ వుంటే, ఎమ్మెస్ చాలా ప్రశాంతంగా టీఆర్ఎస్ పాలన బాగుందని అనడం వరంగల్ ఓటర్ల మీద బాగా ప్రభావం చూపించే అవకాశం వుందని భయపడుతున్నారు. ఇలా మాట్లాడారంటూ ఎమ్మెస్ మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సస్సెండ్ చేసిన ఆయన పెద్దగా ఫీలయ్యేది కూడా ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్ గండం నుంచి గట్టెక్కేది ఎలా దేవుడా అని టీ కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu