గడువు ముగిస్తే వేటేసినట్టా! వైసీపీ సంబరాలెందుకు?
posted on Oct 17, 2020 5:02PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని పదవులకు గడువు ఉంటుంది. గడువు ముగిశాక ఆ పోస్టులను వేరేవారితో భర్తి చేస్తారు. కొన్ని సార్లు పాతవారినే మళ్లీ నియమిస్తారు. పార్లమెంట్, అసెంబ్లీ స్టాడింగ్ కమిటీల్లోనూ అంతే. కొన్నిసార్లు ఏడాదికో కమిటీ వేస్తారు. కొన్ని సార్లు ఒకే కమిటీని రెండు, మూడు ఏండ్ల పాటు కొనసాగిస్తారు. కొన్ని సార్లు కమిటీల చైర్మెన్లను మాత్రమే మారుస్తారు. ఇంకొన్ని సార్లు చైర్మన్లుగా పాత వారికే రెన్యూవల్ ఇస్తూ.. కమిటీలో సభ్యులను మారుస్తుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్ ను మార్చడాన్ని పెద్ద విషయంగా ప్రచారం చేస్తోంది. గతంలో ఎప్పుడూ జరగనట్లుగా కలరింగ్ ఇస్తోంది.
పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్ గా ఉన్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును మార్చడంపై వైసీపీ సంబరాలు చెసుకుంటోంది. కొంత కాలంగా వైసీపీని చెడుగుడు ఆడుతున్నారు రఘురామ కృష్ణం రాజు. జగన్ సర్కార్ వైఫల్యాలు, వైసీపీ నేతల అక్రమాలపై ఆయన చేసే ఆరోపణలు, విమర్శలు జనాల్లోకి వెళుతున్నాయి. దీంతో ఆయనకు కౌంటర్ ఇవ్వలేక దిక్కులు చూస్తోంది వైసీపీ. ఇప్పుడు రఘురామ ప్లేస్ లో పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్ గా మరో ఎంపీని లోక్ సభ స్పీకర్ నియమించడంతో వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రఘురామ పై వేటు పడిందని ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే స్పీకర్ ఆయన్ను చైర్మెన్ గా తప్పించారని చెబుతున్నారు.
వైసీపీ ప్రచారానికి అసలు జరిగిన దానికే పొంతనే లేదని తెలుస్తోంది. పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్ గా ఏడాది క్రితం రఘురామను నియమించారు. ఇప్పుడు దాని గడువు ముగిసింది. దీంతో స్పీకర్ మరొకరిని నియమించారు. లోక్ సభలో పార్టీల బలాబలాల ఆధారంగా ఈ నియామకాలు జరుగుతుంటాయి. ఇదే విషయాన్ని వివరిస్తూ వైసీపీ బండారాన్ని బయటపెట్టారు రఘురామ కృష్ణం రాజు. తనను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి తొలగించాలని మూడు నెలల క్రితమే వైసీపీ ఎంపీలు స్పీకర్ కు లేఖ రాశారని చెప్పారు. అయితే మధ్యలో తొలగించడం కుదరదని స్పీకర్ అప్పుడే చెప్పారని తెలిపారు. తాజాగా తన పదవి కాలం అయిపోవడంతో కొత్త వారిని నియమించారని చెప్పారు. ఇది ఎప్పుడూ జరిగేదేనని.. వైసీపీ నేతలు ఎందుకు సంబరపడుతున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు రఘురామ.
వైసీపీతో కొన్ని నెలలుగా విభేదిస్తున్నారు రఘురామ కృష్ణం రాజు. జగన్ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయినా రఘురామను పార్టీ నుంచి సస్పెండ్ చేయని వైసీపీ..పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయన్ను తప్పించాలని ప్రయత్నించింది. మూడు నెలల క్రితమే ఆ పని చేసినా స్పీకర్ ఒప్పుకోకపోవడంతో సాధ్యం కాలేదు. ఇప్పుడు రొటిన్ గా మార్పు జరిగినా తామే వేటు వేయించామన్నట్లుగా వైసీపీ విష ప్రచారం చేస్తుందని రఘురామ చెప్పారు.
ఎంపీ రఘురామరాజుపై మరో ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు. త్వరలోనే ఎంపీపై అనర్హత వేటు పడుతుందని చెబుతున్నారు. జగన్ అనుకూల మీడియాలో దీనిపై వార్తలు కూడా వస్తున్నాయి. వైసీపీ కొత్త ప్రచారంపైనా ఘాటుగా స్పందించారు రఘురామ రాజు. తనను ఎవరూ తొలగించలేరని స్పష్టం చేశారు. ఎవరు ఎవరిని తొలగిస్తారో త్వరలోనే తెలుస్తుందన్న నర్సాపురం ఎంపీ.. పదవి నుంచి తొలగించడమంటే అది పూర్తిగా వేరుగా ఉంటుందని.. దాని సంగతి ప్రజలే చూస్తారని హెచ్చరించారు. తనపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలకు మరో సవాల్ విసిరారు రఘురామరాజు. సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేసారు. అమరావతి రాజధాని అంటూ రిఫరెండంగా ఎన్నికలకు వెళ్తే సీఎం వైఎస్ జగన్ పైనే 2 లక్షల మెజార్టీతో నేను గెలుస్తానని చెప్పారు. దమ్ముంటే సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
రఘరామరాజు విషయంలో గతంలోనూ వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. వైసీపీ గుర్తుపై గెలిచిన రఘురామ రాజు తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని మంత్రి బాలినేనితో పాటు కొందరు వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వారి ఆరోపణలకు స్పందించిన రఘురామ తాను రాజీనామాకు సిద్ధమని.. అయితే ఉప ఎన్నికను అమరావతి రాజధానిగా రెఫరెండంగా తీసుకోవాలని సవాల్ చేశారు. రఘురామ సవాల్ ను స్వీకరించేందుకు అధికార పార్టీ వెనకడుగు వేసింది. దీంతో అమరావతిని రెఫరెండంగా తీసుకుంటామనే ధైర్యం చేయలేక రఘురామ సవాల్ నుంచి వైసీపీ నేతలు పారిపోయారనే విమర్శలు వచ్చాయి.