దుబ్బాక వైపు కన్నెత్తి చూడని రాములమ్మ.. కారణం అదేనా?
posted on Oct 17, 2020 3:25PM
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్‌ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర నాయకత్వాన్ని మొత్తం దుబ్బాకలో ప్రచారానికి దింపింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, దుబ్బాకలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే, దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఫైర్ బ్రాండ్ విజయశాంతి కంటికి కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
విజయశాంతి గతంలో మెదక్ ఎంపీగా పనిచేశారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఆమె కీలక నేత. అలాంటిది, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంటే ఆమె కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
దుబ్బాక ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరఫున విజయశాంతిని నిలపాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు తొలుత వార్తలొచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానికంగా ఆమెకున్న పట్టు, ఆమె వ్యక్తిగత ఇమేజ్ తో ఉపఎన్నికలో సులభంగా గెలవొచ్చని రాష్ట్ర నాయకత్వం భావించిందని.. దీనికి ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనికి స్థానిక నేతల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవ్వడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీనికితోడు మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేరడంతో స్థానిక సమీకారణాలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు టికెట్ ఇచ్చారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురైన విజయశాంతి దుబ్బాక వైపు కన్నెత్తి కూడా చూడటంలేదని తెలుస్తోంది.
మరోవైపు, విజయశాంతి ఇక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారని, ఇకపై సినిమాల్లో నటించేందుకు పూర్తి సమయం కేటాయిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. గతంలో లేడీ అమితాబ్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి చాలా ఏళ్ళ విరామం తర్వాత.. మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరూ మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఆ మూవీ అనంతరం ఆమెకు వరస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఆమె రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమయ్యారని, ఇకపై సినిమాల్లో నటించేందుకు పూర్తి సమయం కేటాయిస్తారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.