సీపీఎం నూతన సారథి ఎం.ఎ. బేబీ
posted on Apr 6, 2025 9:35PM

సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. సీతారాం ఏచూరి గత ఏడాది మృతి చెందినప్పటి నుంచీ సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. . ఈ నేపథ్యంలో తమిళనాడులోని మదురైలో జరిగిన పార్టీ 24వ మహాసభల్లో కేరళ మాజీ ఎంఏ బేబీ సీపీఎం నూతన సారథిగాఎన్నికయ్యారు. తమిళనాడులోని చారిత్రాత్మక నగరమైన మధురైలో గత ఐదు రోజులుగా జరుగుతున్న పార్టీ 24వ మహాసభ ముగింపు రోజైన ఆదివారం (ఏప్రిల్6) పార్టీ ప్రతినిథులు సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంఏబేబిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సుదీర్భ రాజకీయ అనుభవం ఉన్న ఎంఏ బేబీ సీపీఎం ఆరవ ప్రధాన కార్యదర్శిగా పార్టీని ముందుకు నడిపించనున్నారు. సీతారాం ఏచూరి హఠాన్మరణం తరువాత సీపీఎం సీనియర్ నాయకుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు అయిన ప్రకాష్ కరత్ తాత్కాలిక సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు పార్టీ పూర్తి స్థాయి ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేటీని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పార్టీ మహాసభలో ప్రధాన కార్యదర్శి పదవి కోసం పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు, రైతు ఉద్యమాల సారథి అశోక్ ధావలే సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవికి గట్టిగా పోటీ పడ్డారు.అయితే రాజకీయ అనుభవం ఉన్న ఎం.ఏ. బేబీకే పార్టీ పట్టం గట్టింది.
1954లో కేరళ జన్మించిన ఎం.ఏ. బేబీ విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. పాఠశాల స్థాయిలోనే ఆయన కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ (కేఎస్‌ఎఫ్)లో చురుకుగా పాల్గొన్నారు. ఆ తరువాత కేఎస్‌ఎఫ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)గా మారిన తరువాత కూడా ఆయన అందులో చురుకుగా పాల్గొనడమే కాకుండా కీలక బాధ్యతలు నిర్వహించారు.
1986 నుంచి 1998 వరకు రెండు రాజ్యసభ సభ్యుడిగా కేరళ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచే కేరళ రాజకీయాలలో క్రియాశీలంగా ఉండి పలుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కేరళ రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2012లో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు సీపీఎం ప్రధాన కార్య దర్శిగా ఎన్నికయ్యారు. ఆయl నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.