వైసీపీ రాజకీయం మహా ఘోరం
posted on Nov 3, 2015 9:24AM

వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీకి భవిష్యత్తులో రాష్ట్ర చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం దక్కబోతోంది. అధికారం కోసం ఘోరమైన రాజకీయాలు నడిపిన పార్టీగా వైసీపీ చరిత్రలో మిగలబోతోంది. వైసీపీ నాయకుల మీద వున్న అవినీతి కళంకం మాట అలా వుంచితే, ప్రతిపక్షంలో వున్న వారు నడుపుతున్న ఘోరమైన రాజకీయాలు ఏమాత్రం రాజకీయ స్పృహ వున్నవారికైనా ఏవగింపును కలిగిస్తున్నాయి. వైసీపీ అసలు స్వరూపం తెలిసిన ప్రజలు ఆ పార్టీకి గత ఎన్నికలలో అధికారం ఇవ్వలేదు. ఓటమిని పెద్ద మనసుతో అంగీకరించి, తమలో వున్న లోపాలను సరిదిద్దుకోవడం, రాష్ట్రాభివృద్ధికి అధికార పార్టీకి సహకరించడం ద్వారా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం సరైన పద్ధతి అనిపించుకుంటుంది. అయితే వైసీపీ అందుకు విరుద్ధమైన పద్ధతిలోనే పయనిస్తోంది. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎడ్డెం అంటే తెడ్డెం అనే ధోరణిలోనే వ్యవహరిస్తోంది. రాజధాని కోసం భూ సేకరణ విషయం కావచ్చు.. హుదుద్ తుఫాను సహాయ కార్యక్రమాలు కావచ్చు.. సాధారణ పరిపాలనకు సంబంధించిన విషయాలు కావచ్చు... ప్రభుత్వం చేపట్టిన ఏ విషయంలోనైనా నానా గందరగోళం సృష్టించడమే వైసీపీ ధ్యేయంగా వుంది. అయితే రోజు రోజుకూ వైసీపీ తన పరిధిని దాటి ఘోరమైన రాజకీయాలను ప్రదర్శించడమే బాధాకరమైన విషయం
వైసీపీ తన రాజకీయ మనుగడ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. ప్రాంతీయవాదం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే ఎంతో నష్టపోయింది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌లో కూడా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని వైసీపీ ప్రయత్నించడం దారుణం. వైసీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు తాజాగా చేసిన వ్యాఖ్యలే అందుకు ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు, రాయలసీమకు చెప్పలేనంత అన్యాయం జరిగిపోతోందని ధర్మానవారు వాపోయారు. ఇది ముమ్మాటికీ రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడమేనని తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు ఘాటుగా ధర్మాన వాదనను తిప్పికొట్టారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తోందీ ఉదాహరణలతో సహా చెప్పారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టొద్దని ధర్మానకి వార్నింగ్ ఇచ్చారు. అంచేత వైసీపీ బాబులూ... మీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ప్రాంతీయ చిచ్చు పెట్టకండి.