ప్రముఖ హాస్య నటుడు కొండవలస మృతి
posted on Nov 3, 2015 6:43AM
.jpg)
తెలుగు సినీ పరిశ్రమ వారం రోజుల వ్యవధిలోనే మరో ప్రముఖ హాస్య నటుడుని కోల్పోయింది. సరిగ్గా వారం రోజుల క్రితమే ప్రముఖ హాస్య నటుడు కళ్ళు చిదంబరం వైజాగులో మృతి చెందారు. మళ్ళీ నిన్న రాత్రి మరో ప్రముఖ హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు (69) హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. నిన్న రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో ఆయనని కుటుంబసభ్యులు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్ను మూశారు.
కొండవలస లక్ష్మణరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామం. ఆయన ఆగస్ట్ 10,1946న లో జన్మించారు. కానీ అ తరువాత వారి కుటుంబం కళలకు కాణాచి అని చెప్పబడే విజయనగరం వచ్చి అక్కడే స్థిరపడింది. ఆయన చిన్నపాటి నుంచే బుర్రకధలు, నాటాకాల పట్ల చాలా ఆసక్తి చూపేవారు. విజయనగరంలో స్థిరపడటంతో ఆయన కళా రంగం వైపు ఆకర్షితులయ్యారు. ఆయన సుమారు 2,000కు పైగా నాటకాలలో నటించారు. వైజాగ్ పోర్టులో పనిచేసేవారు. ఉద్యోగం చేస్తూనే అనేక నాటకాలు వేసేవారు. ఆయన నటించిన మొట్ట మొదటి నాటిక ‘సవతి తల్లి.’ అందులో ఆయన ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించారు. దానికి ఆయనకు నంది అవార్డు కూడా అందుకొన్నారు. మళ్ళీ ఆ తరువాత ‘కేళీ విలాసం’ అనే నాటకంలో విలన్ పాత్ర చేసి దానికీ మరొక నంది అవార్డు అందుకొన్నారు.
“అవును వాళ్లిదరూ ఇష్టపడ్డారు” సినిమాతో ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి కబ్బడీ కబ్బాడీ, దొంగ రాముడు అండ్ పార్టీ, సత్యం, పల్లకీలో పెళ్లి కూతురు, రాధా గోపాళం, కాంచనమాల కేబుల్ టీవి, ఎవడి గోల వాడిదే, అందాల రాముడు, బాస్, సైనికుడు, రాఖి, అత్తిలి సత్తిబాబు, సుందర కాండ, బ్లేడు బాబ్జి, బెండు అప్పారావు ఆర్.ఎం.పి.,అదుర్స్, వరుడు, కత్తి కాంతారావు వంటి సినిమాలలో తన అద్భుతమయిన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఆయన సుమారు 300పైగా సినిమాలలో నటించారు.శ్రీకాకుళం యాసలో ఆయన పలికిన “నేనొప్పుకోను...ఐతే ఒకే...” “ఐతే నాకేటి...?వంటి డైలాగ్స్ ఎప్పటికీ ప్రజలకు గుర్తుండిపోతాయి. ఆయన అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించబడుతాయి.