50 పెళ్ళిళ్ళ ‘నిత్య పెళ్ళికూతురు’ అరెస్ట్!

తమిళనాడులోని తిరుపూర్‌కి చెందిన ఒక యువకుడికి 35 ఏళ్ళు. పెళ్ళి సంబంధాల అన్వేషణలో భాగంగా ఒక మాట్రిమోనీ వెబ్‌సైట్‌ని ఆశ్రయించాడు. ఆ వెబ్‌సైట్ సూచించిన విధంగా సంధ్య అనే మహిళని పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళయిన మూడు నెలల పాటు వీరి కొత్త కాపురం సజావుగానే సాగింది. మూడు నెలల తర్వాత సంధ్య ప్రవర్తన అతనికి ‘ఏదో తేడాగా వుందే’ అనిపించింది. దాంతో పెళ్ళికి ముందు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ పెళ్ళయిన మూడు నెలల తర్వాత చేశాడు. ఆధార్ కార్డు చెక్ చేస్తే, అందులో సంధ్య పేరు వేరేగా వుంది. అందులో భర్త పేరు కూడా వుంది. ఇదేంటని సంధ్యని నిలదీస్తే, చప్పుడు చేయకుండా కూర్చో.. లేకపోతే చంపేస్తానని ఆమె బెదిరించింది. దాంతో అదిరిపోయిన ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకి ఇలాంటి కేసులు దొరికితే రెచ్చిపోయి ఇన్వెస్టిగేషన్ చేసేస్తారు కదా.. మన సంధ్య విషయంలో కూడా అలాగే చేశారు. అప్పుడు పోలీసులు కూడా కళ్ళు తిరిగి పడిపోయే రేంజ్‌లో వాస్తవాలు బయటికొచ్చాయి. ఈ సంధ్య అప్పటి వరకు 50 మందిని పెళ్ళి చేసుకున్నట్టు బయటపడింది. ఈ మహా ఇల్లాలు ‘నిత్యపెళ్ళికూతురు’ అనే బాంబులాంటి విషయం వెల్లడయింది. పెళ్ళి చేసుకోవడం, వేధించడం, డబ్బు, నగలు చేజిక్కించుకోవడం... ఆ తర్వాత జంప్ అవడం... ఇదీ సంధ్య హాఫ్ సెంచరీ పెళ్ళిళ్ళ వెనుక వున్న అసలు మేటర్. సంధ్య ఇప్పటి వరకు పెళ్ళి చేసుకున్న వారిలో ఒక డీఎస్పీ, ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్, మదురైలోని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, కరూర్‌లో ఒక ఫైనాన్స్ అధికారి... ఇలా ఇప్పటి వరకు 50 మంది లెక్క తేలారు. సంధ్య అకౌంట్లో ఇంకా ఎంతమంది వున్నారో ఆమెకైనా గుర్తుందో లేదో.. ఏది ఏమైనప్పటికీ 50 పెళ్ళిళ్ళు చేసుకోవడమే కాకుండా... పోలీస్ ఆఫీసర్లని కూడా పిచ్చోళ్ళని చేసిన సంధ్య గుండె చాలా గొప్పది.. ఆ గుండె బతకాలి!