జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు!
posted on Oct 5, 2024 10:42PM
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి వచ్చిన నేషనల్ అవార్డు రద్దయింది. తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన యువతి మీద అత్యాచారం జరిపాడన్న ఆరోపణ మీద జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో, ఆయనకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా వచ్చిన నేషనల్ అవార్డును అవార్డుల కమిటీ రద్దు చేసిసింది. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ ఎంపిక అయ్యారు. తిరుచిట్రంబళం అనే తమిళ సినిమాలోని ‘మేఘం కరుకాథ’ అంటూ సాగే పాటకు కొరియోగ్రఫీ చేసినందుకు ఆయన్ని ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఎంపిక చేశారు. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు జాతీయ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ అవార్డు ఫంక్షన్ కోసం జానీ మధ్యంతర బెయిల్ పొందారు. ఈ నెల 8న ఆయన అవార్డు అందుకోవలసి వుంది. నేషనల్ అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్‌కి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ అవార్డు రద్దు చేయడంతో బెయిల్ రద్దుపై సందిగ్ధం ఏర్పడింది.
అవార్డు అందుకోవడం కోసం జానీ మాస్టర్‌కి బెయిల్ ఇచ్చినందుకు ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యాచారం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అవార్డు ఇవ్వడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వచ్చాయి. జానీ మాస్టర్‌కి జాతీయ అవార్డుల కార్యక్రమంలో కనిపించడానికి సిగ్గు వుండాలి లాంటి ఘాటు విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌కి ప్రకటించిన నేషనల్ అవార్డు రద్దయింది.