నేటి నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలు
posted on Nov 26, 2015 8:11AM
.jpg)
ఇవ్వాల్టి నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. వచ్చే నెల 28వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ సమావేశాలలో సుమారు 30 బిల్లులు ఆమోదం పొందవలసి ఉంది. లోక్ సభలో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది కనుక అక్కడ బిల్లులు ఆమోదం పొందగలుగుతున్నాయి కానీ రాజ్యసభలో కాంగ్రెస్ మిత్రపక్షాలదే పైచెయ్యి అవడంతో అక్కడకి వచ్చేసరికి బిల్లులు తిరస్కరించబడుతున్నాయి. అయినా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు గత పార్లమెంటు సమావేశాల నుండి సరికొత్త వ్యూహం అమలుచేస్తున్నాయి. సమావేశాలు మొదలవక మునుపు కొన్ని నెలల ముందు నుంచి ఏదో ఒక అంశంపై పోరాటం మొదలపెట్టడం, సమావేశాలు మొదలవగానే దానిపై సభలో చర్చ జరగాలనో లేక మంత్రులు రాజీనామా చేయాలనో పట్టుబడుతూ సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తోంది.
లలిత్ మోడీ, వ్యాపం వ్యవహారాలలో తమ పార్టీ పార్లమెంటును స్తంభింపచేయబోతోందని గత వర్షాకాల సమావేశాలు మొదలయ్యే ముందు కాంగ్రెస్ ఎంపీ శశీ ధరూర్ నోరు జారారు. తమ వ్యూహాన్ని ముందే బయటపెట్టినందుకు సోనియా గాంధీ ఆయనకు క్లాసు పీకారు కూడా. ఈసారి కూడా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మళ్ళీ అటువంటి వ్యూహాన్నే అమలుచేయబోతున్నట్లు నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్పష్టమయింది.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వేచ్చేక దేశంలో మత అసహనం పెరిగిపోతోందని పనిగట్టుకొని విషప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఈ సమావేశాలలో అదే అంశంతో సభా కార్యక్రమాలను స్తంభింపజేసే అవకాశం ఉంది. గత రెండు మూడు నెలలుగా దేశంలో అనేక మంది ప్రముఖులు తమ అవార్డులను వెనక్కి తిరిగి ఇచ్చేయడాన్ని ఆధారంగా చేసుకొని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం ప్రకటించబోతోంది.
జి.ఎస్.టి., రియల్ ఎస్టేట్, ఎస్సి ఎస్టీ బిల్లు, అగ్రికల్చర్ బయో సెక్యురిటీ బిల్లు, న్యూక్లియర్ సేఫ్టీ బిల్లు, బాలనేరస్థుల శిక్షలను కటినతరం చేయడం, అలాగే కేంద్రప్రభుత్వం జారీ చేసిన కొన్ని ఆర్డినెన్స్ లకు పార్లమెంటు ఆమోదం పొందడం, ప్రభుత్వ శాఖలకు, రాష్ట్రాలకు వివిధ పద్దుల క్రింద అదనపు నిధులు మంజూరు చేయడానికి బడ్జెట్ సవరణల ప్రతిపాదనల ఆమోదం వంటి అతి ముఖ్యమయిన అంశాలపై ఈ సమావేశాలలో చర్చించవలసి ఉంది. కానీ బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించినందున మంచి ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పార్లమెంటులో మోడీ ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకే ఆసక్తి చూపుతున్నాయి.