మోడీ.. తెగిన బంధాలు అతికేనా?
posted on Mar 19, 2025 11:46AM

ప్రధాని హోదాలో తొలి సారి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి
సార్వత్రిక ఎన్నికల పరాభవంతో తత్వం బోధపడిందా?
తన రిటైర్మెంట్ ఏజ్ పెంపును అభ్యర్థంచడానికేనా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మార్చి 30 న నాగాపూర్ వెళుతున్నారు. అందులో విశేషం ఏముంది, అనుకుంటే అనుకోవచ్చును, కానీ వుంది. అందుకే, మోదీ నాగపూర్ టూర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజమే మోదీ ఒక్క నాగపూర్ అనేముంది, దేశంలో ఎక్కడికైనా వెళతారు. ఆమాట కొస్తే దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళతారు. వెళుతూనే ఉన్నారు. 2014 లో ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశం మొత్తం ఎన్నిసార్లు చుట్టి వచ్చి వుంటారో లెక్కలేదు. నిజానికి, ఈ 11 ఏళ్లలో ఆయన నాగపూర్ కూడా అనేక మార్లు పర్యటించి ఉంటారు. అయితే గత పర్యటనలు వేరు, ప్రస్తుత పర్యటన వేరు, అంటున్నారు. అందుకే, మోదీ నాగాపూర్ పర్యటన కోసం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరివారం మాత్రమే కాదు, అన్య రాజకీయులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .
అవును ప్రధాని మోదీ ఈ నెల 30న, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్వర్యంలో పనిచేస్తున్న, మాధవ్ నేత్రాలయ, కంటి పరిశోధన సంస్థ నూతన భవన సముదాయం శంఖుస్థాపన కార్యక్రమలో పాల్గొనేందుకు నాగపూర్ వెళుతున్నారు. ఆయనతో పాటుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్గరీ, మహా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మాధవ నేత్రాలయం తెలిపింది.
అయితే మోడీ నాగపూర్ పర్యటన కేవలం అందు కోసమేనా అంటే కాదు. అసలు విషయం, విశేషం అది కాదు.అదే రోజున నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి హోదాలో నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో తొలి సారిగా అడుగు పెడుతున్నారు. అవును 2014లో ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటిన తర్వాత మోదీ ఇంతవరకు సంఘ్ ప్రధాన కార్యాలయంలో కాలు పెట్ట లేదు. ఇన్నాళ్ళు ఆయనకు ఆ అవసరం ఎందుకు రాలేదో, ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఏమో కానీ, ఢిల్లీ నుంచి దిగి వచ్చి నాగాపూర్ సంఘ్ కార్యాలయం చేరుకుంటున్నారు. ఆ విధంగా చూసినప్పుడు మోదీ నాగపూర్ పర్యటన ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.అంతే కాదు, ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సహా సంఘ్ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నట్లు వస్తున్న వార్తలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. గతంలోనూ సంఘ్ పెద్దలతో మోదీ సమావేశమయ్యారు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తిని పెంచుతోంది.
అదొకటి, అయితే, అంతకంటే ముఖ్యమైన విషయం, మరొకటి వుంది. ఈ సమావేశంలో ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న బీజేపీ అధ్యక్షుని ఎంపిక మొదలు, బీజేపీ – ఆర్ఎస్ఎస్ సంబంధాలకు సంబంధించి అనేక కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు, బీజేపీ,ఆర్ఎస్ఎస్’ మధ్య పొరపొచ్చాలు పై కొచ్చాయి. కాషాయ కూటమితో కమల దళం దూరం పెరిగింది. అప్పట్లో బీజేపీఅధ్యక్షుడు జీపీ నడ్డా, బీజేపీ ,ఆర్ఎస్ఎస్ సంబధాల గురించి చేసిన వ్యాఖ్యలు, వివాదాన్ని సృష్టించాయి. ఒక ఇంటర్వ్యూ లో ఆర్ఎస్ఎస్ - బీజేపీ సంబంధాల గురించి మాట్లాడుతూ నడ్డా, అటల్ బిహారీ వాజపేయి హయాంలో,బీజేపీ బలహీనంగా ఉండడం వలన,అప్పట్లో ఆర్ఎస్ఎస్ అవసరం బీజేపీకి ఉండేది, ఇప్పడు మోదీజీ నాయకత్వంలో పార్టీ బాగా బలపడింది. ఇప్పడు ఆర్ఎస్ఎస్ అవసరం మాకు లేదు అని అన్నారు.
సహజంగానే నడ్డా సమాధానం,ఆర్ఎస్ఎస్ పెద్దలకు నచ్చలేదు. ఆర్ఎస్ఎస్ పెద్దలకే కాదు, సాధారణ, స్వయం సేవకులు (సంఘ్ కార్యకర్తలు) ఎవరికీ నచ్చలేదు. అయితే అటు బీజేపీ, ఇటు ఆర్ఎస్ఎస్ నాయకులు మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదు సమాచార లోపం వల్ల వచ్చిన చిన్న సమస్య సాల్వయిపోయిందని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే నడ్డా, అనాలోచిత ప్రకటనకు బీజేపీ మూల్యం చెల్లించింది. సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. అందుకు ఇంకా ఇతర కారణాలు ఉన్నా, నడ్డా ప్రకటనతో బీజేపీ - ఆర్ఎస్ఎస్ మధ్య పెరిగిన దూరం కూడా ఒక ప్రధాన కాణంగా బీజేపీ గుర్తించింది. అందుకే, మోదీ షా జోడీతో సహా బీజేపీ మహా’ నాయకులకు తత్త్వం బోధ పడింది. బీజేపీ మళ్ళీ మాతృ సంస్థ ఒడికి చేరింది. ఫలితంగా, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎనికల్లో బీజేపీ అనూహ్య విజయాలను సొంత చేసుకుంది. 3 0 ఏళ్ల తర్వాత ఢిల్లీలో గెలిచింది. హర్యానా, మహారాష్ట్రల్లో వరసగా రెండవ సారి విజయం సాధించింది.
ఈనేపధ్యంలో, ప్రధాని హోదాలో మోదీ, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో తొలి సారిగా కాలు పెట్టడం, సంఘ్ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కావడం, జాతీయవాద సంస్థల సంబందాల విషయంగానే కాకుండా రాజకీయంగానూ, ప్రాధాన్యతగల అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ పరిణామలను కొంచెం లోతుగా విశ్లేషించుకుంటే, ఒక విధంగా ఆర్ఎస్ఎస్ తో బీజేపీ సంబంధాలు పూర్తి స్థాయిలో సర్డుకోలేదని,ఇంకా శేషం మిగిలే ఉందన్న సందేహం మిగులుతుంది. అంతా బాగుంది అనుకుంటే ఈ భేటీ అవసరం ఏముందనే ప్రశ్న వస్తుంది. మరో విధంగా చూస్తే. ప్రధాని మోదీ @ 75 పదవిలో కొనసాగేందుకు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు అవసరమని గుర్తించి, సంఘ్ పెద్దలతో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారని అనుకోవచ్చని అంటున్నారు.
నిజానికి ఇటీవల కాలంలో మోదీ మాతృ సంస్థకు దగ్గరయ్యే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. కొద్ది రోజులక్రితం క్రితం,ఎంఐటీకి చెందిన లెక్స్ ఫ్రిడ్మన్ పోస్ట్ చేసిన పోడ్ కాస్ట్ లోనూ మోదీ ఆర్ఎస్ఎస్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్ఎస్ఎస్ ఒక సంస్థ మాత్రమే కాదు. భారతీయతకు జీవం పోసే, మహోన్నత ఉద్యమం అంటూ మెచ్చుకున్నారు. జాతి ప్రయోజనాల విషయంలో ఆర్ఎస్ఎస్ కు ఉన్న నిబద్దతను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అంకిత భావాలను గొప్పగా చెప్పు కొచ్చారు. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థ ప్రపంచంలో మరొకటి లేదని అన్నారు. అలాగే, ఆర్ఎస్ఎస్ ద్వారానే తాను తన జీవిత పరమార్ధాన్ని అర్థం చేసుకున్నానని చెప్పుకొచ్చారు. ఇదొకటే కాదు అంతకు ముందు ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనంలోనూ మోదీ మరాఠీ భాషతో ఉన్న సంబంధానికి నాగపూర్ (ఆర్ఎస్ఎస్)తో తనకు తనకున్న అనుబంధాన్ని ముడివేశారు. అదే క్రమంలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఆర్ఎస్ఎస్ సజీవంగా ఉంచుతోందని అన్నారు. ఇలా, ఆర్ఎస్ఎస్లో పుట్టి పెరిగిన మోదీనే ఆర్ఎస్ఎస్కు దగ్గరయ్యేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించవలసి రావడం నిజం అయితే, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్యనే కాదు, ఆర్ఎస్ఎస్ - మోదీ మ ధ్య సంబంధాలు కూడా అంత సజావుగా లేవన్న అనుమానాలకు బలం చేకూరుతుంది.
అలాగే, మోదీ స్వయం ప్రకటిత రిటైర్మెంట్ ఏజ్ కి (75) దగ్గర పడుతున్న నేపధ్యంలో, పదవీ కాలం పొడిగింపు కోసం, మోదీ ప్రయత్నిస్తున్నారా నాగపూర్ టూర్ పరమార్ధం అదేనా, అందుకోసమేనా, మోదీ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో అడుగుపెడుతోంది ..అందుకోసమేనా ఈ పొగడ్తలు, ఈ భేటీలు ? అంటే, ఏమో అయినా కావచ్చును, అన్నదే నాగపూర్ సమాధానం.