విధుల నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపు!?
posted on Mar 24, 2025 3:33PM

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో నోట్ల కట్టలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సొమ్మంతా లెక్కల్లో చూపనిదిగా తేలింది. లెక్కల్లో చూపని సొమ్ము కట్టలు కట్టలుగా ఆయన నివాసంలో బయటపడింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్నిప్రమాదం సంభవిం చడంతో ఈ నోట్ల కట్టల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఇంత భారీ ఎత్తున నగదు ప్రత్యక్షమవడం న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై సుప్రీం కోర్టు సీజేఐ సంజీవ్ కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నేతృత్వంలోని కొలీజియం అత్యవసరంగా సమావేశమై జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలు తీసుకుకుంది. ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ దీనిని వ్యతిరేకించింది.
దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతానికి న్యాయపరమైన ఎటువంటి బాధ్యతలూ అప్పగించరాదని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ వెంటనే ఢిల్లీ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ నుంచి ఆయనకు సంబంధించిన అన్ని వివరాలను సైతం తొలగించారు. అలాగే నోట్ల కట్టల విషయంలో పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ను నియమించింది.